యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ బయటకి వెళ్లిపోవడం, దానిలో సభ్యదేశాలని కూడా ఆలోచనలో పడేసింది. బ్రిటన్ బాటలో స్వీడన్ కూడా బయటకి నడిచే అవకాశం కనిపిస్తోంది. ఇంతవరకు స్వీడన్ ప్రభుత్వం కానీ ఆ దేశ ప్రజలు గానీ అటువంటి ఆలోచన చేయలేదు. కానీ, బ్రిటన్ వెళ్లిపోయిన తరువాత వారికి ఆ ఆలోచన కలిగింది. ఈయూలో బ్రిటన్ తరువాత స్వీడన్ మూడో అతిపెద్ద సభ్యదేశంగా ఉంది. అది కూడా ఇంచుమించు బ్రిటన్ ఎదుర్కొంటున్న సమస్యలనే ఎదుర్కొంటోంది. కనుక ఈయూ నుంచి విడిపోవడమే మేలనే ఆలోచన మొదలైంది.
బ్రిటన్ లో బ్రెగ్జిట్ పేరిట రిఫరెండం నిర్వహిస్తున్న సమయంలోనే స్వీడన్ లో కూడా కొన్ని ప్రైవేట్ సంస్థలు ‘స్విడ్జిట్’ పేరిట ఒక సర్వే నిర్వహించాయి. టి.ఎన్.ఎస్.ఎఫ్. సిఫో అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈయూ నుంచి విడిపోవాలని36 శాతం మంది, వద్దని 32 శాతం మంది, విడిపోవాలో వద్దో చెప్పలేమని 32 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది అనధికార రిఫరెండం అయినప్పటికీ స్వీడన్ ప్రజలు కూడా ఈయూ నుంచి విడిపోవాలనే కోరుకొంటున్నట్లు సంకేతాలు ఇచ్చినట్లే భావించవచ్చు. మరి స్వీడన్ ప్రభుత్వం ఈ సర్వే ఫలితాలపై ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.
ఈయూ సభ్యదేశాల నుంచి స్వీడన్ కి వచ్చి స్థిరపడేవారే కాకుండా, ఐసిస్ ఉగ్రవాదుల దాడుల కారణంగా లిబియా, ఇరాక్ తదితర దేశాల నుంచి వేలాదిగా శరణార్ధులు స్వీడన్ కి తరలివస్తున్నారు. ఈయూలో సభ్యత్వం వలన స్వీడన్ కి కూడా చాలా ఆర్దిక భారం, నిరుద్యోగ సమస్య వంటి అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. ఒకవేళ స్వీడన్ బ్రిటన్ బాట పడితే మరిన్ని సభ్యదేశాలు కూడా అదే బాటలో నడువవచ్చు. అదే జరిగితే యూరోపియన్ యూనియన్ పూర్తిగా విచ్చినం అయిపోవచ్చు. దాని దుష్ప్రభావం సభ్యదేశాల మీదే కాకుండా యావత్ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై కూడా పడే అవకాశం ఉంటుందని ఆర్దిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటన్ ఈయూ నుంచి బయటకు వెళ్ళిపోతూ పెద్ద తేనె తుట్టెని కదిపి వెళ్లిపోయిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. చివరికి ఇది ఎక్కడకి దారి తీస్తుందో ఎవరూ ఊహించలేని పరిస్థితి నెలకొని ఉంది.