వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారయణ ఇంట్లో జరిగిన సోదాలపై ఈడీ ప్రకటన చేసింది. హయగ్రీవ భూముల విషయంలో జరిగిన లావాదేవీలు, అక్రమ నగదు చెలామణిపైనే ఈ సోదాలు నిర్వహించినట్లుగా తెలిపింది. అందులో కొన్ని డిజిటల్ డివైస్ లు, ఇతర బినామీ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈడీ చేసిన ప్రకటనను విశ్లేషించుకుంటే అర్థం అయ్యేది ఏమిటంటే… ఆయన కుటుంబసభ్యుల కిడ్నాప్ పేరుతో జరిగిన డ్రామా కూడా ఈ భూముల సెటిల్మెంట్ లో భాగమే.
హయగ్రీవ భూముల విలువ రెండు వందల కోట్ల పైనే ఉంటుంది. వైసీపీ హయాంలో జరిగిన అనేకానేక దోపిడీల్లో ఇదీ ఒకటి. ఎవరికి వెళ్లాల్సిన వాటాలు వారికి వెళ్లలేదేమో కానీ.. ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ స్టోరీ బయటకు వచ్చింది. చివరికి సాక్షి పత్రికకు రెండు ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చి ఎంవీవీ సత్యనారాయణ సెటిల్ చేసుకున్నారు. కానీ అసలు విషయం మాత్రం పోలీసులు బయటకు రానివ్వలేదు. ఇప్పుడు ఈడీ బయటకు లాగుతోంది.
ఈడీ సోదాల్లో దొరికిన ఆధారాలతో ఏపీ పోలీసులు కొత్తగా విచారణ చేపడితే విషయం తాడేపల్లి ప్యాలెస్ దాకా చేరినా ఆశ్చర్యం లేదు. కిడ్నాప్ పేరుతో అరెస్టు అయిన రౌడీ షీటర్ ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఇప్పటికే ఈ కేసును రీఓపెన్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈడీ ఆధారాలతో మరింత వేగంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.