తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా వచ్చిన దీపాదాస్ మున్షి వ్యవహారం కాంగ్రెస్ వర్గాల్లోనే కలకలం రేపుతోంది. ఇంచార్జ్ అంటే తన ఊళ్లో పనులు చూసుకుని ఏదైనా సమస్య వస్తే పరిష్కరిస్తారు లేకపోతే పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటారు. కానీ ప్రభుత్వం ఏర్పడగానే దీపాదాస్ మున్షి ఇంచార్జ్ హోదాలో తెలంగాణలో దిగిపోయారు. ఇక్కడే ఉంటున్నారు. ఏం చేస్తున్నారు అంటే… సమాంతర పాలన చేస్తున్నారని అంటున్నారు. ఇది ఆరోపణ కాదని నిజమేనని ఆమె ఇంటి వద్ద రోజూ ఉండే సందడిని చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది.
దీపాదాస్ మున్షి ఓ విలాసవంతమైన భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. నెలకు ఐదారు లక్షలు అద్దె దానికి చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఇంటి వద్ద ఎప్పుడు చూసినా లాబీయిస్టుల హడావుడే కనిపిస్తూ ఉంటుంది. కొంత మంది అధికారులూ ఉంటారు. కొన్ని విషయాల్లో ఆమె నేరుగా ఆదేశాలు జారీ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈమె వ్యవహారం రోజు రోజుకు శ్రుతమించుతూండటంతో ప్రభుత్వ వర్గాల్లోనూ అసహనం పెరుగుతోంది.
గట్టిగా ఆమెను ప్రశ్నిస్తే హైకమాండ్ కు తప్పుడు ఫిర్యాదులు పంపుతుందని కొంత మంది భయపడుతున్నారు. మరికొంత మంది రేవంత్ తో పని కావడం లేదు కాబట్టి మున్షి ద్వారా పనులు చేయించుకుందామని ప్రయత్నిస్తున్నారు. హైకమాండ్ పాలన సాగుతోందన్న అభిప్రాయం వచ్చేలా మున్షి చేస్తున్న రాజకీయం వివాదాస్పదం అవుతోంది. వచ్చిన కొత్తలోనే ఓ లగ్జరీ కారును బహుమతిగా పొందారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఇలాంటి పాలన తీరు వల్లే కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతరేక పెరుగుతుంది. దీపాదాస్ హైదరాబాద్ నుంచి మకాం ఎత్తివేయకపోతే… ఇంకా ఎక్కువ ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉంది.