రుషికొండ ప్యాలెస్‌ను ఏం చేయాలన్నదానిపై ప్రభుత్వం ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. వైసీపీ గెలిచి ఉంటే జగన్ రెడ్డి ఆ ఏడు బంగళాల ప్యాలెస్‌లో జల్సా చేస్తూ ఉండేవారు. కానీ ఆయనకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. అందుకే ఇప్పుడు ఆయన బెంగళూరు, తాడేపల్లి ప్యాలెస్ ల మధ్య చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. కానీ ఆయన చేసిన నిర్వాకం వల్ల ప్రజాధనం మాత్రం దుర్వినియోగం అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలన్నది కూడా పెద్ద సమస్యగా మారింది.
రుషికొండ ప్యాలెస్ ను తాజాగా పవన్ కల్యాణ్ పరిశీలించారు. అధికారంలో ఉన్న ఓ రాజకీయ నాయకుడు ఇంత ఘోరంగా ప్రజా సొమ్మును ఎలా దుర్వినియోగం చేస్తారోనని ఆయన ఆశ్చర్యపోయారు. ఈ ప్యాలెస్ ను ఏం చేయాలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కూడా భావిస్తున్నారు. ఇప్పటికీ ఈ భవనానికి నిర్వహణ ఖర్చులు అదనపు భారంగా మారుతున్నాయి. ఈ లగ్జరీ బిల్డింగ్‌లను సరిగ్గా నిర్వహించకపోతే పాడైపోయే ప్రమాదం ఉంది.
ఎదైనా స్టార్ హోటల్‌కు లేదా రిసార్టుకు లీజుకు ఇస్తే ఆదాయం అయినా వస్తుందని అనుకుంటున్నారు. ఈ ప్యాలెస్ కట్టేందుకు కూల్చిన రిసార్టుల వల్ల ఏడాదికి పాతిక కోట్లకుపైగా ఆదాయం వచ్చేది . ఇప్పుడు దాన్ని కూల్చి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి చేసిన నిర్మాణం వల్ల అంత కూడా ఆదాయం వస్తుందో రాదో తెలియని పరిస్థితి. మొత్తంగా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఏర్పడింది.