‘గేమ్ ఛేంజర్’.. దిల్ రాజు కెరీర్లోనే ప్రతిష్టాత్మక చిత్రం. ఈ సినిమాపై ఆయన భారీగా ఖర్చు పెట్టారు. ఎన్నో అవాంతరాల్ని ఎదుర్కొన్నారు. విడుదల విషయంలోనూ చాలా ఫైట్ చేశారు. ‘విశ్వంభర’ని వాయిదా వేయించి మరీ… ‘గేమ్ ఛేంజర్’ విడుదల చేస్తున్నారు. తన సినిమా సంక్రాంతికి వస్తే, రికవరీ అవ్వడం గ్యారెంటీ అన్నది ఆయన నమ్మకం. అందుకే సంక్రాంతిని టార్గెట్ చేశారు. డిసెంబరు 20న వస్తే సోలో రిలీజ్ ఉంటుందని తెలిసి కూడా, గట్టి పోటీ ఉన్న సంక్రాంతి సీజన్లో తన సినిమాను దింపుతున్నారు.
అయితే ఈ సంక్రాంతికి వీలైనంత తక్కువ పోటీ ఉంటే బాగుంటుందన్నది దిల్ రాజు ఆలోచన. మిగిలిన సినిమాలు వస్తున్నాయా, రావట్లేదా? వస్తే ఏ సినిమాలో ఎంత బలం ఉంది? అనే క్యాలిక్లేషన్లు దిల్ రాజు వేసుకొంటున్నారు. మరోవైపు.. తమ సంస్థ నుంచే వెంకటేష్ – అనిల్ రావిపూడిల సినిమా తయారవుతోంది. ఇది కూడా సంక్రాంతిని టార్గెట్ చేసిన సినిమానే. నిజానికి ‘గేమ్ ఛేంజర్’ కోసం ఆ సినిమాను సైతం వాయిదా వేద్దామని భావించారు. కానీ ఇప్పుడు దిల్ రాజు లెక్కలు మారినట్టు తెలుస్తోంది. ‘గేమ్ ఛేంజర్’ 10న విడుదల చేసి.. నాలుగు రోజుల గ్యాప్ లో అంటే జనవరి 14న వెంకీ సినిమాని వదలాలనుకొంటున్నారు. అందుకే అనిల్ రావిపూడికి డెడ్ లైన్ విధించినట్టు సమాచారం. డిసెంబరు రెండో వారంలోగా ఫస్ట్ కాపీ చేతిలో ఉండాలని టీమ్ కి చెప్పేశార్ట. వీలును బట్టి.. సంక్రాంతి బరిలో దింపాలన్నది దిల్ రాజు ఆలోచన. ఈ సంక్రాంతికి మూడే సినిమాలు (గేమ్ ఛేంజర్, బాలయ్య సినిమా, గుడ్ బాడ్ అగ్లీ) ఉంటే గనుక నాలుగో సినిమాగా వెంకీ చిత్రాన్ని వదలాలని చూస్తున్నారు. ఈ సంఖ్య పెరిగితే అప్పుడు వెంకీ సినిమా వాయిదా వేస్తారు. ఇప్పటికైతే సంక్రాంతి లక్ష్యంతోనే సినిమా పూర్తి చేయాలని అనుకొంటున్నారు. అనిల్ రావిపూడి కూడా దిల్ రాజు ఆదేశాలను అనుసరించి ఈ సినిమా షూటింగ్ చక చక పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది.