రజనీకాంత్ నటిస్తున్న కబాలి సినిమా ప్రచారానికి ఆ సినిమా నిర్మాతలు సరికొత్త ఐడియా కనిపెట్టారు. దేశీయ మరి అంతర్జాతీయ విమానాలపై కబాలి సినిమా పోస్టర్లు అంటించి ప్రచారం చేయాలని నిర్ణయించుకొన్నారు. మన దేశంలో మొట్టమొదటిసారి ఇటువంటి ప్రచారానికి కబాలి సినిమాతో శ్రీకారం చుడుతున్నారు. అందుకోసం చిత్ర నిర్మాతలు రెండు స్వదేశీ విమాన సంస్థలతో, రెండు అంతర్జాతీయ విమాన సంస్థలతో ఒప్పందం చేసుకొన్నారు. భారత్ లో తమిళనాడులో తిరిగే విమానాలపై, రజనీకాంత్ కి ఎక్కువ అభిమానులున్న జపాన్, సింగపూర్ లకి వెళ్ళే విమానాలపై కబాలి పోస్టర్స్ అంటించి ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది ఆశించిన ఫలితాలు ఇస్తే మరిన్ని విమానాలపై పోస్టర్లు అంటించి ప్రచారం చేసే అవకాశం ఉంది. దీని వలన విమాన సంస్థలకి అదనపు ఆదాయం లభిస్తుంది కనుక అవి కూడా సంతోషంగా అందుకు అంగీకరించవచ్చు. ఇప్పటికే కబాలి ఫస్ట్ లుక్, ట్రైలర్స్ లకి చాలా మంచి స్పందన వస్తోంది. దానికి ఇది అదనపు ఆకర్షణ అవుతుంది. ఈ ఐడియా చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ దక్షిణాది సినీ పరిశ్రమ కంటే హిందీ సినీ పరిశ్రమకే దేశవిదేశాలలో పెద్ద మార్కెట్ ఉంది కనుక దీనిని అందిపుచ్చుకొంటే దానికే ఎక్కువ లాభం కలుగవచ్చు.