ఏపీ ప్రభుత్వం ప్రజలకు పౌరసేవల్ని వాట్సాప్ ద్వారా అందించేందుకు సిద్దమయింది. ఈ మేరకు మెటాతో కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ప్రభుత్వం తరపున చేసే పౌరులకు అందే సేవల్లో సింహభాగం వాట్సాప్ ద్వారానే అందుతాయి. అంటే సర్టిఫికెట్లు మంజూరు దగ్గర నుంచి చిన్న చిన్న పనులకు గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయనున్నారు.
యువగళం పాదయాత్రలో నారా లోకేష్ కు యువత నుంచి ఎక్కువగా వచ్చిన ఫిర్యాదు.. తమకు కావాల్సిన కులం, ఆదాయం ఇతర సర్టిఫికెట్లు అందడం లేదని.. వాటి కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని. ఈ అంశంపై అప్పుడే నారా లోకేష్ హామీ ఇచ్చారు. సమయం వృధా కాకుండా సర్టిఫికెట్లు అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. ఆ ప్రకారం బాగా ఆలోచించి వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్లతో సహా ఇతర పౌరసేవలు అందేలా చూడాలని నిర్ణయించారు. ఈ మేరకు మెటా సంస్థతో చర్చలు జరిపారు.
మెటా సంస్థ ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధం కావడంతో ఢిల్లీలో ఒప్పందం చేసుకున్నారు. నారా లోకేష్ సమక్షంలో మెటా ప్రతినిధి, ప్రభుత్వ ప్రతినిధి మధ్య ఒప్పందం జరిగింది. వీలైనంత త్వరగా మెటా చాట్ బాట్ సేవల ద్వారా సేవల అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.