తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏదీ కలసి రావడం లేదు. కావాలని చేసుకుంటున్నారో నిర్లక్ష్యమో కానీ సొంత నేతలు తీవ్ర అసహనంతో దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. జీవో 29పై ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఇదేదో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆయన ఈ పనిచేయలేదు. తాజాగా మంత్రులు, జర్నలిస్టుల కొరియా పర్యటనపైనా విమర్శలు చేశారు. అంటే ఆయన ప్రభుత్వంపైనే రగిలిపోతున్నారని అర్థం.
తాజాగా జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా మీకో దండి.. మీపార్టీకో దండం అని టీ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు నేరుగా చెప్పేశారు. జగిత్యాలలో ఆయన అనుచరుడి హత్య జరిగింది. ఇది పాతకక్షల వల్ల జరిగిందని పోలీసులు చెబుతున్నారు. కానీ తనను బలహీనం చేయడానికి కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఇదంతా చేస్తున్నారని జీవన్ రెడ్డి అంటున్నారు. మమ్మల్ని బతకనీయరా అని మండిపడుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా తన సీనియార్టీని గుర్తించి మంత్రి పదవి ఇస్తారని ఆయన అనుకున్నారు. అలాంటి ఆలోచన కూడా రాష్ట్ర, కేంద్ర నాయకత్వాలు చేయలేదు. పైగా తనపై గెలస్తూ వస్తున్న సంజయ్ కుమార్ ను రాత్రికి రాత్రి పార్టీలో చేర్చుకున్నారు. దీంతో నలభై ఏళ్ల పాటు జగిత్యల కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్న ఆయనకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ఎంపీ టిక్కెట్ ఇచ్చినా ఓడిపోయారు. ఇప్పుడు అసలు పార్టీలో పట్టించుకునేవారే లేరు. ఈ కోపం అంతా ఈ హత్య ఘటన నేపధ్యంగా తీర్చేసుకున్నారు. ఇక పార్టీలో ఉండబోనన్నారు.
పార్టీ అధికారంలోకి రావడంతో ఎవరికి వారు భిన్నమైన రాజకీయం చేస్తున్నారు. పార్టీ ఇంచార్జ్ అంటూ వచ్చిన వారు పాలనలో వేలు పెట్టి పార్టీ గురించి పట్టించుకోవడం లేదు. కానీ ఎవరైనా చేరుతామని వస్తే కండువా కప్పేస్తున్నారు. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై దృష్టి సారించాల్సిన పరిస్థితి గట్టిగానే కనిపిస్తోంది.