జీరో… హేటర్స్
జీరో… కాంట్రవర్సీ
జీరో… ఈగో
ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే – అది కేవలం ప్రభాస్ మాత్రమే!
ప్రభాస్ నవ్వు చాలు, వినయంగా విసిరే చూపు చాలు. ‘నాదేం లేదండీ.. అంతా ఫ్యాన్స్ వల్లే’ అంటూ ఒదిగే గుణం చాలు. ప్రభాస్ ఏమిటో చెప్పడానికి.
ఒక్క హిట్టొస్తే చాలు. అప్పుడెప్పుడో పాతాళ భైరవి నుంచి ఇప్పటి బాహుబలి వరకూ తెలుగు ఇండస్ట్రీ చూసిన హిట్లన్నీ తమ చలవే అని భారీగా ఫీలైపోయి భుజాలు ఎగరేస్తారు కొంతమంది హీరోలు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో ‘ఈ సినిమాతో రెండొందల కోట్లు కొట్టేస్తాం’ అంటూ డబ్బాలు కొట్టేస్తారు. ప్రెస్ ముందు, ప్రెస్ మీట్లలో.. తమ దర్పం హోదా చూపిస్తారు. వాళ్ల ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడూ వరద ప్రవాహమే.
కానీ ప్రభాస్ ఇవేం చేయడు. కనీసం నోరు విప్పి మాట్లాడడు. ‘డార్లింగ్స్..’ అంటూ తన ప్రేమని చిన్ని పదంలో కూర్చడం మినహా – ఎప్పుడూ గొప్పులు చెప్పుకోడు. ఎవరైనా తన గురించి చెబితే పట్టించుకోడు.
వర్షం, ఛత్రపతి చిత్రాలతో ప్రభాస్ అంటే ఏమిటో మనకు తెలిసింది.
బాహుబలితో రెబల్ స్టార్ అంటే ఎవరో సినిమా ప్రపంచానికి అర్థమైంది.
సలార్, కల్కి.. తనని మరోమెట్టు ఎక్కించాయి. ప్రభాస్ ఇప్పుడు తెలుగు హీరో కాదు. పాన్ ఇండియా హీరో కూడా కాదు. తను గ్లోబల్ ఇమేజ్ ఉన్న హీరో. తనతో సినిమా అంటే.. లెక్క రూ.500 కోట్ల నుంచి మొదలవుతుంది. అది వెయ్యి కోట్ల సినిమానా, రెండు వేల కోట్లు గుంజుకొంటుందా? అనేది దర్శకుడి పనితనం మీద ఆధార పడి ఉంటుంది. అంతెందుకు.. ప్రభాస్ కటౌట్ ఉంటే చాలు.. వందల కోట్లు వచ్చి పడతాయ్. అదీ ప్రభాస్ స్టామినా.
ఇంత ఉన్నా, ఇన్ని చేసినా.. ప్రభాస్ సింపుల్‌గానే ఉంటాడు. మీడియా ముందుకొచ్చేటప్పుడు హంగామా చేయడం తెలీదు. పీఆర్ని పెట్టుకొని సోషల్ మీడియాలో తన గురించి బిల్డప్పులు ఇచ్చుకోవడం తెలీదు. తనని తాను మార్కెటింగ్ చేసుకోవడం కూడా అస్సలు తెలీదు. నిజంగా అవన్నీ చేసి ఉంటే.. ప్రభాస్ స్థాయి ఇంకాస్త పెరిగేదేమో. కానీ ఈ ఒర్టినాలిటీ మాత్రం ఉండేది కాదు. ప్రభాస్ లో ఫ్యాన్స్‌కు నచ్చేది కూడా అదే. ఆ సింపుల్సిటీ తన స్టార్డమ్కు మరిన్ని వెలుగులు అద్దింది.
ప్రభాస్ ఆతిథ్యం గురించి ఇండస్ట్రీలో కథలు కథలుగా చెప్పుకొంటారు. `ఫుడ్డు పెట్టి చంపేస్తాడు బాబోయ్` అంటారు. అది ఒక వైపు మాత్రమే. ‘నా’ అనుకొనేవాళ్లకు ప్రభాస్ ప్రాణాలు ఇచ్చేస్తాడు. ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు, తనకు కావల్సినవాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు అందించిన గుప్తదానాలు అన్నీ ఇన్నీ కావు. ఏ ప్రకృతి విపత్తు సంభవించినా, ఇండస్ట్రీ మొత్తం స్పందిస్తుంది. కానీ ఎక్కువ మొత్తం ప్రభాస్ నుంచే వస్తుంది. ప్రభాస్ గురించి తప్పుడు వార్త, చెప్పుడు వార్త ఎప్పుడూ బయటకు రాదు. ఎవరూ మాట్లాడుకోరు కూడా. ప్రభాస్ కూడా అంతే. ఎప్పుడూ పాజిటీవ్ వైబ్రేషన్స్ తో ఉంటాడు. అదే అతను సాధించిన అద్భుతమైన విజయం…!
ప్రభాస్ భవిష్యత్తులో ఇంకా ఎత్తుకు ఎదుగుతాడు. ఎన్నో శిఖిరాలు అధిరోహిస్తాడు. కానీ ఎప్పటికీ ఇలానే సింపుల్ గా ఉంటాడు. ఎందుకంటే.. అతని తన జీవితంలో భాగమైపోయిన సాధారణమైన విషయం.
హ్యాపీ బర్త్ డే డార్లింగ్.. రాబోయే రోజుల్లో మరిన్ని గొప్ప విజయాలతో టాలీవుడ్ పేరు ప్రపంచ వాప్తంగా మార్మోగేలా చేయ్..! శతమానం భవతి.
(ఈరోజు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా)