తెలంగాణ ప్రభుత్వ ఆదాయం అన్ని రంగాల్లో తగ్గడం ఖచ్చితంగా డేంజర్ బెల్స్ మోగించేదే. ఒక్క మద్యం విషయంలో మాత్రం కొంచెం పెరుగుదల కనిపించింది. అది కూడా రూ. 31 కోట్లే పెరుగుదల. అంటే పరిగణనలోకి తీసుకోవాల్సిన పని లేదు. రిజిస్ట్రేషన్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది. హైడ్రా భయం పోయిన తర్వాతే ఆ ఆదాయం పుంజుకుంటుంది. అయితే మిగిలిన రంగాల్లో ఎందుకు ఆదాయం పడిపోయిందన్నది పెద్ద మిస్టరీ. వాణిజ్య పన్నుల శాఖ సహా అన్ని శాఖల్లోనూ ఆదాయం తగ్గింది. చివరికి పెట్రో ఉత్పత్తులపై పన్నుల ఆదాయం కూడా తగ్గింది.
ప్రభుత్వ ఆదాయం పడిపోవడాన్ని ముఖ్యమంత్రి తేలికగా తీసుకోకూడదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆర్థిక కార్యకలాపాలు భారీగా ఉన్నాయని రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందని ప్రత్యక్షంగా కనిపించే సాక్ష్యమే ఆదాయం. భారీగా లావాదేవీలు జరిగితేనే ఆదాయం వస్తుంది. ఇప్పుడు తెలంగాణలో ఆదాయం పడిపోయిందంటే రేవంత్ రెడ్డి సర్కార్ విధానాల వల్లనే అనే వారి విమర్శలు పెరుగుతాయి. కేటీఆర్ కూడా అదే అంటున్నారు. రాజకీయంగా ఎదురుదాడి చేసినా .. అక్కడ ఫలితం మాత్రం కళ్ల ముందు కనిపిస్తుంది.
ఆదాయం పడిపోయిందా లేదా అన్నది ప్రజలు పట్టించుకోరు. అది రాజకీయ అంశం కాదు. ఓట్లు ప్రభావితం కావు. కానీ పాలనా సామర్థ్యానికి మాత్రం ఇది గీటురాయిగా నిలుస్తుంది. గత ప్రభుత్వ అవ్యవస్థల్ని చక్కదిద్దేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సంస్కరణల వల్ల ఆాదాయం తగ్గవచ్చు. కానీ వెంటనే పుంజుకునేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని మాత్రం ప్రస్తుత పరిస్థితి గుర్తు చేస్తోంది.