హైదరాబాద్ కు సామాన్యుల నగరంగా పేరు ఉంది. రూ. పదివేలు సంపాదించినా హాయిగా బతకొచ్చు.. రూ. పది లక్షలు సంపాదించినా హాయిగా బతకొచ్చన్న పేరు ఉండేది. అంటే ఆల్ రౌండర్ సిటీ. ఐటీ రంగంలో భారీగా అభివృద్ధి చెందిన తర్వాత కూడా సామాన్యులు బతకగలిగేలా ఉండేది. ఎవరి స్థాయిలో వారికి తగ్గ నివాస, ఆహార సదుపాయాలు లభించేవి. అదే సమయంలో బెంగళూరులో ఓ మాదిరి ఉద్యోగి కూడా బతకడం కష్టమని అనుకునేవారు. ముఖ్యంగా ఇళ్ల అద్దెలు సామాన్యులకు అందుబాటులో ఉండవు. ఇప్పుడా ఆ పరిస్థితి హైదరాబాద్ కు వస్తోంది ఇంటి అద్దెలు హైదరాబాద్లో భరించలేని స్థితికి చేరుతున్నాయి.
కాస్త పోష్ అపార్టుమెంట్లలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కనీసం నలభై నుంచి యాభై వేల రూపాయల వరకూ ఉంటుంది. మామూలు అపార్టుమెంట్లలో ఇది ఇరవై వేలకు తక్కువ ఉండటం లేదు. శివారు ప్రాంతాల్లో అపార్టుమెంట్లు డబుల్ బెడ్ రూం … మెయిన్టనన్స్తో కలిపి ఇరవై వేలకు చేరుతోంది. ఇక ఇండిపెండెంట్ ఇళ్లలో చిన్న చిన్న పోర్షన్లుగా కాలనీల్లో నిర్మించే ఇళ్ల అద్దె పదిహేను వేల రూపాయల వరకూ ఉంటోంది. ఇక సింగిల్ రూముల సంగతి చెప్పాల్సిన పని లేదు. చిన్న చిన్న పనులు చేసుకుందామని సిటీకి వచ్చే వాళ్లు ఇంటి అద్దెలు కట్టలేక వెనుదిరిగిపోతున్న సందర్భాలు ఉన్నాయి.
కరోనా సమయంలో హైదరాబాద్లో ఏ వీధిలో చూసినా టూలెట్ బోర్డులు కనిపించేవి . ఆసమయంలో ఇంటి అద్దెలు సగానికి సగం పడిపోయి. ఏడాదిన్నర కిందట రూ. పదివేలు చెప్పినా ఇంట్లోకి అద్దెలకు వస్తారో రారో అనుకునే పరిస్థితి నుంచి ఉన్న వాళ్లను ఖాళీ చేయించి… మరీ డబుల్ రెంట్ కు ఇచ్చే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ కు పెరుగుతున్న జనాభా వలసతో పాటు ఇళ్ల డిమాండ్ పెరగడంతో అద్దెలు భారం అవుతున్నాయి. ఈ పరిస్థితి మరింత దిగజారితే.. బెంగళూరే బతకడానికి బెటర్ అనుకునే పరిస్థితి వస్తుంది.