తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విపక్షాలపై మరింత అగ్రెసివ్‌గా వెళ్లాలని అనుకుంటోంది. సియోల్ పర్యటనలో ఉన్న పొంగులేటి బృందం.. తమతో పాటు జర్నలిస్టుల్ని కూడా తీసుకువెళ్లింది. వారితో అక్కడ తెలంగాణ రాజకీయాలపైనా డిస్కస్ చేస్తున్నారు. తాజాగా పొంగులేటి ఓ టీవీ చానల్‌తో ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయిని ప్రకటించారు. అవేమిటంటే… బీఆర్ఎస్ నేతలపై కేసులే. ఎంతటి వాళ్లైనా తప్పు చేస్తే తప్పించుకోలేరు.. సాక్ష్యాధారాలతో ఫైళ్లన్నీ సిద్ధమయ్యాయిని ఇక వదిలి పెట్టేది లేదని ఆయన అంటున్నారు.
ఇంత కాలం కక్ష సాధింపులు అంటారని కాస్త చూస్తూ చూడనట్లుగా ఉన్నారు కానీ ఇక ఉపేక్షించేది లేదని.. సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఫోన్ ట్యాపింగ్, ధరణి, కాళేశ్వరం అంశాల్లో ప్రధాన నేతలపై చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తామని ఆయన అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇప్పటికే పాత్రధారులు నెలల తరబడి జైల్లో ఉన్నారు. సూత్రధారి అమెరికా పారిపోయి రావడం లేదు. మధ్యలో బీఆర్ఎస్ నేతలు వెళ్లి ఆయనతో చర్చలు జరిపి వస్తున్నారని అంటున్నారు.
మరో వైపు కాళేశ్వరం విచారణ జరుగుతోంది. నిజానికి పదేళ్ల పాలనలో అక్రమాలను పట్టుకుని అరెస్టులు లాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే పెద్ద విషయం కాదు. కానీ కక్ష సాధింపుల కోసం అరెస్టులు చేస్తున్నారన్న భావన ప్రజల్లోకి వస్తే మైనస్ అవుతుంది. అలాంటి పరిస్థితి లేకుండా ముందుగా వారు చేసిన తప్పుల్నిప్రజల్లో పెట్టి అరెస్టు చేసినా తప్పు లేదన్న భావన తీసుకు వస్తే అప్పుడు పొలిటికల్ గా ఎలాంటి వ్యతిరేకత రాదు. ఆ దిశగా ప్రయత్నిస్తారో.. పొంగులేటి చెప్పినట్లుగా బాంబులు పేల్చేస్తారో..లేకపోతే ఉత్తుత్తి బెదిరింపులో… రెండు, మూడు రోజుల్లోనే తేలిపోయే అవకాశం ఉంది.