హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న వందలాది ఆక్రమిత గ్రామ పంచాయతీ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధిస్తున్నట్టు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నిజానికి ఎలాంటి ప్రకటనలు ప్రభుత్వం చేయలేదు. ఆ వార్తలు ఎలా వచ్చాయంటే హెచ్ఎండీఏ వెబ్సైట్లో ఎప్పుడో అప్లోడ్ చేసిన కొన్ని డాక్యుమెంట్ల ఆధారంగా ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లటంతో ఆ జాబితాను వెబ్ సైట్ నుంచి తొలగించారు.
హైదరాబాద్ శివార్లలో ఉన్న వందలాది పంచాయతీ లేఅవుట్లు హెచ్ఎండీఏ ఏర్పాడకముందే వెలిశాయి. వీటిని ఆ కాలంలోనే.. లేఅవుట్లు చేసి అమ్మేశారు కూడా. దీంతో.. ఆ స్థలాలు చాలా మంది చేతులు మారిపోయినట్టు తెలుస్తోంది. అయితే.. హెచ్ఎండీఏ ఏర్పడిన తర్వాత ఈ ఆక్రమిత లేఅవుట్లలో కొన్నింటిని క్రమబద్ధీకరించటంతో.. ఆ స్థలాల్లో పెద్ద పెద్ద బిల్డింగులు కూడా నిర్మించారు. ఇంతలోనే ఆక్రమిత లేఅవుట్లను నిషేధిత జాబితాలో చేర్చారన్న వార్తలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.
పంచాయతీ లేఅవుట్లని ఏపీ రిజిస్ట్రేషన్ చట్టం 2007 నవంబర్ 19, సెక్షన్ 22ఎ(1)(ఈ) కింద ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టింది. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నవాళ్లంతా ఈ విషయంపై అప్రమత్తమై హెచ్ఎండీఏ అధికారులను సంప్రదిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాబితాకు హెచ్ఎండీఏకు సంబంధం లేదని అవేమీ నిషేధిత జాబితాలో లేవని అంటున్నారు. ప్రజల భయాలను మరింత పెంచడానికి కొంత మంది చేస్తున్న ప్రయత్నాలకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మారుతోంది.