విజువల్ ఎఫెక్ట్స్ కి పెద్ద పీట వేసే దర్శకుల్లో రాజమౌళి ఒకరు. `నా తదుపరి సినిమాల్లో వీఎఫ్ఎక్స్ లేకుండా చూసుకొంటా` అని చెబుతుంటారు కానీ, ప్రతీ కథలోనూ వాటికి ప్రాధాన్యం ఉంటూనే ఉంటుంది. మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నారు రాజమౌళి. ఇందులోనూ వీఎఫ్ఎక్స్ దే అగ్రతాంబూలం. ఈపాటికే ఈ సినిమా మొదలు కావాలి. కానీ.. ఆలస్యమైంది. ఏప్రిల్ వరకూ ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం లేదు. మరి ఈలోపు రాజమౌళి ఏం చేస్తున్నారు? ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఆలస్యం అవుతోంది?
దానికి కారణం… మళ్లీ వీఎఫ్ఎక్సే. ఈ సినిమాకు సంబంధించి వీఎఫ్ఎక్స్ పై రాజమౌళి భారీ కసరత్తులు చేస్తున్నారు. పలుదేశాల స్టూడియోలతో ఆయన ప్రతి రోజూ సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి కొంతమేర వీఎఫ్ఎక్స్ పనులు మొదలయ్యాయని సమాచారం. నిజానికి బ్లూమాట్, గ్రీన్ మాట్లపై షూట్ చేశాక, ఆ తరవాత వీఎఫ్ఎక్స్ పని మొదలవుతుంది. కానీ ఈ సినిమా కోసం మాత్రం ఈ ప్రోసెస్ ని రివర్స్ చేస్తున్నట్టు సమాచారం. ముందుగా విజువల్ ఎఫెక్ట్స్‌కు సంబంధించిన పనులు పూర్తి చేసి, ఆ తరవాత షూటింగ్ మొదలు పెట్టనున్నార్ట. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ 40 శాతం వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తయ్యిందన్నది ఇన్ సైడ్ వర్గాల మాట. అదే నిజమైతే… మహేష్ బాబు సినిమా అనుకొన్నదానికంటే వేగంగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈసారి రాజమౌళితో హాలీవుడ్ సంస్థలు చేతులు కలిపే అవకాశం ఉంది. డిస్నీలాంటి సంస్థలు నిర్మాణ భాగస్వామ్యం అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. హాలీవుడ్ సంస్థల దగ్గర ఉన్న పేచీ ఏంటంటే… అవుట్ పుట్ ని వాళ్లకు ముందే ఇవ్వాలి. రిలీజ్ డేట్ కు కనీసం 4 నెలల ముందైనా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేయాలి. అది రాజమౌళి ముందున్న పెద్ద టాస్క్. అందుకే ముందుగా వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది.