మౌలిక సదుపాయాల కొరతతో టార్చర్ పెడుతున్న బెంగళూరు విషయంలో మల్టీనేషనల్ కంపెనీలు తమ ప్రణాళికలతో పాటు ఉన్న ఆఫీసుల్ని తరలించేందుకు పునరాలోచన చేస్తున్నాయని ప్రముఖ వ్యాపారవేత్త మోహన్ దాస్ పాయ్ సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అందిపుచ్చుకున్న నారా లోకేష్ ఆయనతో పాటు ఐటీ పరిశ్రమ ప్రముఖులకు ఆహ్వానం పలికారు. ఏపీ ఇండస్ట్రియల్ పాలసీని కొత్తగా ఆవిష్కరించామని పెట్టుబడులతో వస్తే అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. లోకేష్ పిలుపు కాసేపట్లోనే వైరల్ గా మారింది.
వాతావరణం సాధారణంగా ఉన్నప్పుడే బెంగళూరులో హెవీ ట్రాఫిక్ ఉంటుంది. వర్షాల కారణంగా పెద్ద ఎత్తున జన జీవనం స్తంభించిపోయింది. ఈ పరిస్థితులు ఎప్పటికి మెరుగుపడతాయో తెలియదు. అదే సమయంలో బెంగళూరులో ఓవర్ ఫ్లో అయిపోయిందని అక్కడ ఆఫీసులు పెట్టడం కన్నా ప్రత్యామ్నాయం చూసుకోవడం మంచిదని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మరో బెంగళూరు అవసరం ఉందని ప్రకటించారు. అది వివాదాస్పదమయింది.
బెంగళూరు ప్రపంచ స్థాయి నగరంగా మారినప్పటికీ… ఆ స్థాయిలో మౌలిక సదుపాయాలు పెంచడంలో ప్రభుత్వాలు ఫెయిలయ్యాయి. పది కిలోమీటర్ల ట్రాఫిక్కు రెండు గంటలు పట్టే ఘోరమైన పరిస్థితి ఉంటుంది. ఇతర మౌలిక సదుపాయాలు పెరగడం లేదు. నీటి సమస్య కూడా వస్తోంది. గతంలో అలాగే ఓ పారిశ్రామిక వేత్త ట్వీట్ చేస్తే కేటీఆర్ వెంటనే తెలంగాణకు వచ్చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు లోకేష్ ఏపీకి రావాలని అంటున్నారు.