‘పుష్ష 2’ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వెండి తెరపై పుష్షరాజ్ విన్యాసాలు ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆత్రుతలో ఉన్నారు. అయితే ‘పుష్ష 2’ మొదటి ప్రేక్షకుడిగా మారే అవకాశం ఓ దర్శకుడికి దక్కింది. ఆయనే రాజమౌళి.
రాజమౌళికీ సుకుమార్‌కీ మధ్య మంచి అనుబంధం ఉంది. సుకుమార్ టేకింగ్, ఆయన రైటింగ్ ని రాజమౌళి బాగా ఇష్టపడతారు. ఈ విషయాన్ని ఆయనే చాలా సందర్భాల్లో చెప్పారు. ‘పుష్ష’ జరుగుతున్నప్పుడు అందులోని కొన్ని సన్నివేశాల్ని సుకుమార్ ముందుగా రాజమౌళికి చూపించారు. ‘ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయండి..’ అనే సలహా రాజమౌళినే ఇచ్చారని టాక్. ఇప్పుడు ‘పుష్ష 2’ విషయంలోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది. ‘పుష్ష 2’ షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతున్నప్పుడు అక్కడే మహేష్ సినిమా వర్క్‌లో బిజీగా ఉన్న రాజమౌళి, సరదాగా `పుష్ష 2` సెట్ కి వెళ్లారు. అక్కడ ‘పుష్ష 2’లోని కొన్ని కీలకమైన సన్నివేశాల్ని రాజమౌళికి చూపించార్ట సుకుమార్. అవి చూసి జక్కన్న బాగా ఇంప్రెస్ అయ్యారని తెలుస్తోంది. ఆ సమయంలో బన్నీ కూడా సెట్లోనే ఉన్నారని సమాచారం. ‘పుష్ష’కు మొదటి ప్రేక్షకుడు రాజమౌళినే. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అదే సెంటిమెంట్ తో ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ముందుగానే చూపించేశారు. ఈసారీ ఆ సెంటిమెంట్ గట్టిగా వర్కవుట్ అవుతుందన్నది ‘పుష్ష’ టీమ్ నమ్మకం.
డిసెంబరు 6న ‘పుష్ష 2’ని విడుదల చేద్దామనుకొన్నారు. అయితే ఒకరోజు ముందుగానే అంటే డిసెంబరు 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు హైదరాబాద్ లో ‘పుష్ష’ నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.