‘పుష్ప 2’ లో అత్యంత కీలకమైంది ‘జాతర ఎపిసోడ్’. ఈ జాతర ఎపిసోడ్ పై నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టారని, రూ.50 కోట్ల వరకూ ఖర్చు పెట్టారని తెలుగు 360 ఇది వరకే ఎక్స్‌క్లూజీవ్‌గా బయటపెట్టింది. ఇప్పుడు మైత్రీ నిర్మాత రవిశంకర్ కూడా అదే చెప్పారు. ‘పుష్ప 2’లో జాతర ఎపిసోడ్ హైలెట్ కానుందని, ఇది మాస్టర్ పీస్‌లా డిజైన్ చేశామని, ఈ ఎపిసోడ్ కోసం చాలా కష్టపడ్డామని చెప్పుకొచ్చారు రవి.
”జాతర ఎపిసోడ్ థియేటర్లో గూజ్బమ్స్ తెప్పిస్తుంది. దాదాపు 35 రోజులు షూట్ చేశాం. పది పదిహేను రోజులు రిహార్సల్స్ కూడా జరిపాం. ఈ ఎపిసోడ్ కోసం బన్నీ చాలా కష్టపడ్డారు. రోజంతా మొహానికి రంగులేసుకొని, చీర కట్టుకొని సెట్లో కూర్చునేవారు. ఆయన పడిన కష్టానికైనా ‘పుష్ప 2’ పెద్ద హిట్ కావాలి” అన్నారు. అయితే ఈ ఎపిసోడ్ కోసం ఎంత ఖర్చు పెట్టారన్న విషయాన్ని మాత్రం స్ట్రయిట్ గా చెప్పలేదు. ”ఈ ఎపిసోడ్ కు బాగానే ఖర్చు పెట్టాం. మైండ్ లెస్‌గా లెక్కలు లేకుండా ఏం వృథాగా ఖర్చు పెట్టలేదు” అని ముక్తాయించారు.
‘పుష్ప 2’లో ఐటెమ్ గాళ్ ఎవరు? అనే విషయంపై కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. శ్రద్దాకపూర్ ని ఫిక్స్ చేశారని ప్రచారం జరిగింది. దీనిపై రవి స్పందించారు. ”ఐటెమ్ గాళ్ ఎవరన్నది రెండు రోజుల్లో తెలిసిపోతుంది. నవంబరు 4 నుంచి ఈ పాటని షూట్ చేస్తాం” అన్నారు.