సొంత గడ్డపై టెస్టుల్లో భారత్ జైత్రయాత్రకు న్యూజీలాండ్ గండికొట్టే ప్రమాదం పొంచి ఉంది. తొలి టెస్టులో భారత్‌ని ఓడించి, ఈ సిరీస్‌ను ఘనంగా ప్రారంభించింది. అయితే ఈరోజు పూణెలో ప్రారంభమైన రెండో టెస్టు తొలిరోజు భారత్ తన ఆధిక్యం చూపించుకోగలిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన న్యూజీలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రెండో టెస్ట్ లో అనూహ్యంగా జట్టులో చోటు సంపాదించుకొన్న స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 59 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీసి తన ప్రతాపం చూపించాడు. మిగిలిన మూడు వికెట్లూ అశ్విన్ ఖాతాలోకి వెళ్లాయి. పది వికెట్లూ స్పిన్నర్లు సొంతం చేసుకోవడం బట్టి చూస్తే పూణె పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకోవొచ్చు. ఓ దశలో కనీసం 350 పరుగుల భారీ స్కోర్ సాధించే దిశగా ఉరకలు వేసిన కివీస్ జట్టును వాషింగ్టన్ బెంబేలిత్తించాడు. అద్భుతమైన బంతులతో కివీస్ బ్యాటర్లని ఓ ఆట ఆడుకొన్నాడు. వాషింగ్టన్కు టెస్టుల్లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. కివీస్ బ్యాటర్లలో కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) రాణించారు.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత్ ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టపోయి 16 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. గిల్ (10), జైస్వాల్ (6) పరుగులతో నాటౌట్ గా నిలిచారు. నాలుగో ఇన్నింగ్స్‌లో పరుగులు సాధించడం చాలా కష్టమని క్యూరేటర్ చెబుతున్నాడు. దీన్ని బట్టి తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యం సంపాదించడం అత్యవసరం అని అర్థమవుతోంది. కనీసం 450 పరుగులు సాధిస్తే.. భారత్ ఈ మ్యాచ్‌ని గెలిచే అవకాశం ఉంది.