Pottel Movie Review
తెలుగు360 రేటింగ్: 2.5/5
అప్పుడప్పుడూ పాత కథలు నెమరువేసుకోవడం మంచిదే. ఎందుకంటే ఏం కోల్పోయామో, ఏం సాధించామో బేరీజు వేసుకోవొచ్చు. ఇప్పుడు అనుభవిస్తున్న స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత పోరాడితే వచ్చిందో తెలుస్తుంది. మనం ఎంత అదృష్టవంతులమో అర్థం అవుతుంది. స్వాతంత్య్రం వచ్చాక కూడా చాలా ఊళ్లకు స్వేచ్ఛ దొరకలేదని, ఓ వర్గం అసమానతల మధ్య నలిగిపోయిందని, తిరుగుబాటు బావుటా ఎగరేస్తే కానీ, మళ్లీ వాళ్లకు స్వరాజ్యం దక్కలేదని తెలుసుకొంటే – ఇప్పటి స్వేచ్ఛపై మరింత గౌరవం పెరుగుతుంది. అందుకే కొన్ని కథలు తెలుసుకోవాలి. ‘పొట్టేల్’ కూడా అలాంటి కథే. పటేల్ పట్వారీ పెత్తనంతో కుదేలైపోయిన ఓ ఊరి కథ. మరి ఆ కథలో ఏముంది? ‘పొట్టేల్’ ద్వారా దర్శక నిర్మాతలు ఏం చెప్పాలనుకొన్నారు? వాళ్ల ప్రయత్నం నెరవేరిందా, లేదా?
పటేల్ పట్వారీ వ్యవస్థలో జనం ఇంకా మగ్గుతున్న కాలంలో గుర్రం గట్టు అనే ఊరి కథ ఇది. ఆ ఊరి కులదైవం బాలమ్మ. ప్రతీ పన్నెండేళ్లకు బాలమ్మ జాతర జరిపి ఓ పొట్టేల్ని బలి ఇవ్వడం ఆనవాయితీ. పొట్టేల్ని పెంచి, జాతర వరకూ సంరక్షించే బాధ్యత తరతరాలుగా ఓ కుటుంబం చూసుకొంటుంటుంది. ఈతరంలో పొట్టేల్ ని సంరక్షించే బాధ్యత గంగాధర్ (యువ చంద్ర కృష్ణ)ది. పటేల్ (అజయ్)ది క్రూర మనస్తత్వం. తన పెత్తనాన్ని ప్రశ్నిస్తే.. తట్టుకోలేడు. తమ జాతి పిల్లలు మాత్రమే చదువుకోవాలని, మిగిలిన జాతి పిల్లల్ని హీనంగా చూస్తాడు. గంగాధర్‌కు చదువంటే ప్రాణం. ‘నేను ఎలాగూ చదువుకోలేకపోయా. కనీసం నా బిడ్డనైనా చదివించాలి’ అనుకొంటాడు. కానీ పటేల్ మాత్రం ఈ విషయాన్ని సహించలేడు. ఎట్టిపరిస్థితుల్లోనూ తమ జాతి కానివాళ్లు చదువుకోకూడదని భావించి, ఆ ఊరి ప్రజల నమ్మకాన్ని అడ్డుపెట్టుకొని అడ్డమైన నాటకాలూ ఆడుతుంటాడు. మరి… కూతుర్ని చదివించాలన్న గంగాధర్ కోరిక నెరవేరిందా, పటేల్ పెత్తనానికి ఆ ఊరు చరమగీతం పాడిందా? అసలు పొట్టేల్కీ, ఈ కథకూ, చదువుకూ సంబంధం ఏమిటి? అనే విషయాలు తెరపై చూడాలి.
ఈ కథని సింపుల్ గా నాలుగు ముక్కల్లో చెప్పడం కుదరని పని. ఎందుకంటే ఇందులో చాలా విషయాల్ని చెప్పడానికి ప్రయత్నించాడు దర్శకుడు. పటేల్ పెత్తనం, ఆ ఊరిలోని మూఢ నమ్మకాలు, చదువు గొప్పదనం, ఆ నాటి సామాజిక వైషమ్యాలు… ఇవన్నీ ఈ కథలోనే మిళితం చేసే ప్రయత్నం చేశాడు. సినిమా చిన్నదే అయినా, స్పాన్ లో మాత్రం చాలా పెద్దది. ఇన్ని విషయాలు ఒకే కథలో చెప్పగలను అనే దర్శకుడి మొండితనానికి, ధైర్యానికీ అభినందనలు. మొదటి 30 నిమిషాలూ దర్శకుడు కేవలం కథని మాత్రమే చెప్పాడు. ఆ ముఫ్ఫై నిమిషాల్లోనే ఎన్నో పాత్రలు పరిచయం అవుతాయి. చాలా లేయర్లు కనిపిస్తాయి. దాంతో దర్శకుడు పెద్ద బాధ్యతే నెత్తిమీద వేసుకొన్నాడు అనిపిస్తుంది. ఆ తరవాత గంగాధర్, బుజ్జమ్మ (అనన్య నాగళ్ల) ప్రేమ కథ మొదలవుతుంది. ఇన్ని విషయాల మధ్య ఈ ప్రేమ కథకు ఎక్కువ స్పేస్ ఇచ్చే అవకాశం రాలేదు. కాబట్టి దాన్ని తొందరగానే ముగించి అసలు కథలోకి వెళ్లిపోయాడు దర్శకుడు. కథ ఫ్లాష్ బ్యాక్, ప్రజెంట్ నేరేషన్లో సాగుతుంది. దాంతో కథలో ఏం జరగబోతోంది అనే ఆసక్తి మొదలవుతుంది. మొదటి అరగంట, ఇంట్రవెల్ బ్యాంగ్ ముందు 10 నిమిషాలూ కథ రక్తికట్టింది. అయితే దీని మధ్య సన్నివేశాలు అంత ఆసక్తిని కలిగించవు. ప్రేమ కథ చూపించింది కాసేపే అయినా బోరింగ్ గా సాగుతుంది. ఇంట్రవెల్ బ్యాంగ్ తో మళ్లీ కాస్త ఆసక్తి రేగుతుంది.
ద్వితీయార్థకాన్ని మరీ హింసాత్మకం చేసేశాడు దర్శకుడు. హీరో ఫస్ట్ సీన్ నుంచి చివరి వరకూ తన్నులు తింటూనే ఉంటాడు. హీరోయిన్ని ఓ సందర్భంలో ఊరంతా చూస్తుండగా విలన్ మూక రాచి రంపాలు పెడుతుంది. హీరో తండ్రి, బావ, ఆఖరికి చిన్న పిల్లది కూడా కష్టాల కడలే. ఇన్ని కష్టాలు అంత పెద్ద తెరపై చూడడం ప్రేక్షకుడికీ కష్టంగానే ఉంటుంది. ఈ కథని ఇలా చెబితే తప్ప ప్రేక్షకుల్లో ఎమోషన్ రాదని దర్శకుడు భావించి ఉండొచ్చు. కానీ మరీ ఇంత క్రూరంగా చూపించాల్సిన పని లేదనిపిస్తుంది. ఓ వైపు హీరోకి కళ్లు కనిపించవు. మరోవైపు పొట్టేలు మాయం అయిపోతుంది. ఇంకోవైపు పటేల్… తన కుటుంబంపై కక్ష పెంచుకొంటాడు. ఊరు ఊరంతా.. గంగాధర్ కుటుంబాన్ని దూరం పెడుతుంది… మరీ ఇన్ని ప్రతిబంధకాలు పెట్టుకొని, పాత్రల్ని ఇంత కష్టపెట్టడం అవసరమా? అనే అనుమానం వేస్తుంది. కొన్నిచోట్ల దర్శకుడు లాజిక్ మిస్సయ్యాడు. ఇది పటేల్ పట్వారీ కాలం నాటి కథ. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక అంటే 1984 ఆ సమయంలో పటేల్ వ్యవస్థ రద్దు అయ్యింది. అంటే.. ఈ కథ కచ్చితంగా 1984లోపు జరిగి ఉండాలి. కానీ తెరపై ఓ సందర్భంలో ‘శివ’ సినిమా చూపించాడు దర్శకుడు. అది 1989లో విడుదల అయ్యింది. 1984లో జరుగుతున్న కథకూ… 1989లో విడుదలైన సినిమాకూ సంబంధం ఏమిటి? పటేల్ ఇంటికి గంగాధర్ దొంగతనానికి వెళ్లి దొరికిపోతాడు. అప్పటి వరకూ గంగాధర్ ఎప్పుడు దొరుకుతాడా? అని ఎదురు చూస్తున్న పటేల్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోడు. `నీ వెనుక ఎవరో ఉన్నారులే` అని చెప్పి వదిలేస్తాడు. పటేల్ అనుకొంటే ఆ క్షణమే గంగాధర్ పై తనకున్న రివైంజ్ తీర్చుకోవొచ్చు. కానీ అలా చేయడు. అదెందుకో అర్థం కాదు. ఇదంతా కోడు గుడ్డుపై ఈకలు పీకే వ్యవహారం ఏం కాదు. మామూలు కమర్షియల్ సినిమాల్లో లాజిక్కులు పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. కానీ ఓ అథెంటిసిటీతో చేసిన సినిమాకు ఇవి కూడా ప్రతిబంధకాలుగా మారతాయి.
క్లైమాక్స్‌లో దర్శకుడు మళ్లీ.. దారిలోకి వచ్చాడు. ఓ నేపథ్య గీతంతో ఎమోషన్ దట్టించి, శత్రు సంహారానికి సరైన వేదిక సిద్ధం చేశాడు. ముగింపు ఆశావాహంగా అనిపించింది. అక్కడ ఎమోషన్ వర్కవుట్ అయ్యింది. కథనంలో వేగం తీసుకొచ్చి, హింస తగ్గించి ఉంటే.. కచ్చితంగా మంచి సినిమాగా నిలిచేది. ఈ విషయంలో అనుమానమే లేదు.
నటీనటుల ఎంపిక చాలా కీలకమైన ప్రక్రియ. పాత్రకు సరితూగే నటుల్ని ఎంచుకోవడం ఓ కళ. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. గంగాధర్ గా చంద్రకృష్ణ, బుజ్జమ్మగా అనన్య ఆకట్టుకొన్నారు. చంద్రకృష్ణ ఎమోషన్ సీన్లలో బాగా నటించాడు. అనన్య క్యారెక్టర్ ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. అయితే సెకండాఫ్‌లో ఆ పాత్రని డల్ గా మార్చేశారు. కానీ చివర్లో ఈ పాత్ర కూడా దారిలోకి వస్తుంది. పటేల్ ఇంటికి వెళ్లి మాట్లాడే సీన్.. రక్తికట్టింది. అక్కడ అనన్యకు మార్కులు పడతాయి. ఇక అజయ్ గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాకి తను విలనే అయినా, ఓ రకంగా హీరో. ఎందుకంటే సినిమాలో 60 సన్నివేశాలు ఉంటే ఆ అరవై కూడా అజయ్ పాత్ర చుట్టూనే తిరుగుతాయి. క్రూరత్వం బాగా పలికించాడు. అమ్మోరు పూనిన సన్నివేశాల్లో ఇంకా బాగా నటించే అవకాశం ఉంది. మొత్తానికి తన కెరీర్లో గుర్తు పెట్టుకొనే సినిమానే ఇది. నోయల్, శ్రీకాంత్ అయ్యంగార్లకు కొత్త తరహా పాత్రలు పడ్డాయి.
సాంకేతికంగా సినిమా చక్కగా ఉంది. చిన్న సినిమాల్లో ప్రొడక్షన్ వాల్యూస్ కనిపించడం చాలా అరుదైన సంగతి. ఈ విషయంలో నిర్మాతల్ని అభినందించాలి. కెమెరాపనితనం, ఆర్ట్ వర్క్, నేపథ్య సంగీతం ఆకట్టుకొన్నాయి. జలపాతం విజువల్స్ బాగున్నాయి. పాటలూ వినసొంపుగా అనిపించాయి. సాహిత్యానికి పెద్ద పీట వేశారు. చివరి పాట గూజ్ బమ్స్ తెప్పిస్తుంది. దర్శకుడిలో విషయం ఉంది. కథని మొదలెట్టిన విధానంలో అది తెలిసిపోయింది. ఓ కథని నమ్మి, ఆ కథని వీలైనంత నిజాయతీగా చెప్పే ప్రయత్నం చేశాడు. కాకపోతే ముందే చెప్పినట్టు హింస ఎక్కువైంది. ఆ డోసు తగ్గిస్తే మంచి ఫలితం దక్కేది. కమర్షియల్ గా ఎలా వున్నా ఈ ఏడాది అవార్డుల జాబితాలో ఈ సినిమా పేరు కనిపించే అవకాశాలు వున్నాయి.
తెలుగు360 రేటింగ్: 2.5/5