జగన్ కుటుంబంలో చిచ్చునకు కారణం అయిన సరస్వతి పవర్ కు ఒక్క రూపాయి ఆదాయం ఉండదు. పేపర్ల మీదనే ఉంటుంది. కానీ ఆ కంపెనీ పేరుతో కంపెనీ పెడతామని చెప్పి పేద రైతుల వద్ద నుంచి అతి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేశారు. ఇంత వరకూ ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టింది లేదు. కానీ జగన్ రెడ్డి సీఎం అయినప్పుడల్లా వాటికి గనులు , నీళ్లు కేటాయించుకుంటూ ఉంటారు. వాటిని చూపించి మళ్లీ పెట్టుబడులు కొట్టేయడానికి అదో ప్లాన్.
జగన్ సీఎం అయ్యాక గనుల లీజును యాభై ఏళ్లు పెంచుకున్నారు. శాశ్వత నీటి కేటాయింపులు చేసుకున్నారు. నిజానికి గత చంద్రబాబు హయాంలోనే లీజుల్ని రద్దు చేశారు. అయినా జగన్ వచ్చాక జీ హుజూర్ అనే అధికారులతో ఫేక్ రిపోర్టు ఇప్పించుకున్నారు. ఆ కంపెనీ ఏదో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుందన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగా తనకేం సంబంధం లేకుండానే కేటాయింపులు జరిగిపోయాయని జగన్ నాటకమాడే ప్రయత్నం చేశారు. కేబినెట్ లో కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇలా సొంత కంపెనీకి కేటాయింపులు చేసుకోవడం ఏంటన్న ప్రశ్న వచ్చినా పట్టించుకోలేదు.
ఇప్పుడు అక్కడ కార్యకలాపాలేమీ లేవు కాబట్టి లీజులు రద్దు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఉల్లంఘనలను దృష్టిలో పెట్టుకుని సరస్వతి కంపెనీ లీజులను ప్రభుత్వం రద్దు చేస్తే… కంపెనీ విలువ పడిపోతుంది. రైతుల వద్ద నుంచి కొన్న భూముల్లో సున్నపు రాయి గనులు ఉంటాయి. వాటిని తవ్వుకునే అవకాశం లేకపోతే ఆ కంపెనీకి ఇక ప్రయోజనమే ఉండదు. ప్రభుత్వం లీజులు రద్దు చేస్తే… ఆ కంపెనీకి విలువే ఉండదు.