సాక్షి పత్రికలో ఆస్తుల వివాదంపై జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా తల్లి, చెల్లిని తప్పు పడుతూ ఓ పేజీ కథనం రాయించిన జగన్ రెడ్డికి షర్మిల అంత కంటే పెద్ద సమాధానం సూటిగా..సుత్తి లేకుండా ప్రత్యేక లేఖ ద్వారా ఇచ్చారు. సాక్షి పత్రికలో వచ్చిన వార్త ఎంత మందికి చేరిందో కానీ షర్మిల ఇలా సోషల్ మీడియాలో రిలీజ్ చేయగానే అలా వైరల్ అయిపోయింది.
షర్మిల ఇందులో ఆస్తులపై తమ మధ్య జరిగిన అనేక చర్చలు, ఒప్పందాల గురించి సాధ్యమైనంత విపులంగా విశ్లేషించారు. కేవీపీ, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో వైఎస్ ఏం చెప్పారో కూడా వివరించారు. ఆ తర్వాత వైెస్ చనిపోయిన తర్వాత జరిగిన ఆస్తుల పంచాయతీలో యలహంక ప్యాలెస్ మొత్తం షర్మిలకే రాసిచ్చేందుకు జగన్ అంగీకరించారు. అన్ని విషయాలు ఎంవోయూ చేసుకున్న తర్వాత జగన్ రెడ్డి మాట మార్చారని షర్మిల అంటున్నారు.
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గుర్తు పట్టలేనంతగా మారిపోయారని ఆయన తల్లి, చెల్లిని కూడా వేధించడం ప్రారంభించారని అంటున్నారు. జగన్ రెడ్డికి ఒక్క సొంత ఆస్తి కూడా లేదని అంతా కుటుంబ వ్యాపారాలేనని తన తండ్రి స్పష్టం చేశారని షర్మిల గుర్తు చేశారు. జరుగుతున్న రచ్చ మొత్తం జగన్ రెడ్డి పుణ్యమేనన్నారు. ఏ ఒక్క మీడియా కి కానీ, కోర్టుకి కానీ, ఈ MOU నాకు నేనుగా బయటపెట్టలేదు. అవకాశం, అవసరం ఉన్నా…ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడినా.. కుటుంబ గౌరవం, YSR పరువు కోసం నేను ఎక్కడా 5 ఏళ్ళు MOU బయట పెట్టలేదు. నాలుగు గోడల మధ్య ఉండాల్సిన MOU ఈరోజు బయటకు వచ్చిందన్నా.. పరస్పరం రాసుకున్న లెటర్లు బయటకు వచ్చాయన్నా.. NCLT లో తల్లి మీద కేసు వేసి సొంత అమ్మకే బ్రతుకు మీద అసహ్యం కలిగించింది జగనేనని స్పష్టం చేశారు.
ఓ వైపు జగన్ , మరో వైపు షర్మిల మొత్తంగా తమ మధ్య ఆస్తుల పంచాయతీ అసలు ఏమిటో మొదటి నుంచి అన్ని బయట పెట్టుకుంటున్నారు. చివరికి ఇంకా ఎన్నెన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాల్సి ఉంది.