జగన్ రెడ్డిని షర్మిల ఇప్పటి వరకూ ఆస్తుల విషయంలో కానీ కుటుంబ వ్యవహారాల విషయంలో కానీ ఒక్క సారి కూడా విమర్శించలేదు. ఆమె రాజకీయంగానే ఎదుర్కొంటున్నారు. జగన్ రెడ్డి రాజకీయంగా షర్మిలను ఎదుర్కోలేక ఆస్తుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఎన్సీఎల్టీకి రాసిన లేఖలు… బయటకు రావడానికి జగన్ రెడ్డినే కారణం. పార్టీ నేతలతో తిట్టించడం… ఆస్తుల్లో వాటా లేదని చెప్పించడంతో ఆమె నాలుగు పేజీల బహిరంగ లేఖ రాయాల్సి వచ్చింది.
ఆస్తుల వ్యవహారంలో జగన్ రెడ్డి చెప్పిన మాటల్ని ఎవరూ విశ్వసించరు. ఎందుకంటే ఆయన ఆరోపణలు చేస్తోంది తల్లి, చెల్లి మీద. ఆస్తుల కోసం తల్లీ, చెల్లీ మీద కేసులు వేసేవాళ్లను ఎవరైనా నమ్ముతారా ?. అలాంటి వ్యక్తికి విలువలు, విశ్వసనీయతలు ఏమీ ఉండవని ఎవరికైనా సులువుగా తెలుస్తోంది. జగన్ రెడ్డి ఇప్పుడు తాను చేస్తున్న తప్పును మరింత పెంచుకుంటున్నారు. తల్లి, చెల్లిని పార్టీ నేతలతో ఇష్టం వచ్చినట్లుగా తిట్టిస్తున్నారు. దీని వల్ల ఆయనకు రాజకీయంగా ఏమైనా లాభం ఉంటుందా ?
ఎవరైనా ఇంటి గుట్టును రహస్యంగా ఉంచుకుంటారు. ప్రజా జీవితంలో ఉన్న వారు అయితే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు. ఏదో విధంగా చేసి ఎవరి రాజకీయం వారు చేసుకుంటారు. కానీ ఇక్కడ జగన్ రెడ్డి తాను కక్ష సాధించాలన్న పట్టుదలను తన కోసం పని చేసిన తల్లి, చెల్లిపై చూపిస్తున్నారు. తనకు రాజకీయంగా నష్టం జరుగుతుందనే లెక్కలు ఆయన వేసుకోలేదు తనను వ్యతిరేకించారు కాబట్టి వారి సంగతి తేల్చాలని ఆయన బయలుదేరారు. ఇలాంటి పిచ్చి రాజకీయాలతోనే పాతాళానికి చేరుకున్నారు. తర్వాత ఇంకెక్కడికి చేరుతారో ?