రేవంత్ రెడ్డి రాజకీయాలు జాతీయ స్థాయి వ్యూహాలతోనే ఎక్కువగా ఉంటున్నాయి. బీజేపీతో ఆయన సన్నిహితంగా ఉంటున్నారని అంటారు కానీ ఆయన చేసే రాజకీయాలు మాత్రం బీజేపీ విధానాల్ని, భావజాలాల్ని ప్రజల్లో చర్చకు పెట్టేలా ఉంటాయి. ఎన్నికల సమయంలో రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం బీజేపీని బాగా చిరాకు పెట్టింది. ఇప్పుడు మహాత్ముడి అంశాన్ని తెరపైకి తెచ్చారు. హైదరాబాద్‌లో అతి పెద్ద మహాత్ముడి విగ్రహాన్నిపెడతామని ప్రకటించారు. లంగర్ హౌస్‌లోని బాపూ ఘాట్‌ను అందుకు తగ్గ ప్రదేశంగా ఎంపిక చేశారు.
గుజరాత్లో సర్దార్ పటేల్ విగ్రహాన్ని పెట్టారు మోదీ. అందు కోసం వేల కోట్లు ఖర్చు పెట్టారు. పటేల్ ను పూర్తిగా రాజకీయ కోణంలోనే గౌరవిస్తున్నారు. పెట్టాలనుకుంటే మహాత్ముడి విగ్రహం పెట్టాలి. ఎందుకంటే మహాత్ముడు కూడా గుజరాతీనే. కానీ ఆయన కన్నా పటేలే గొప్ప అన్నట్లుగా బీజేపీ తీరు ఉంటుంది. బీజేపీ సిద్దాంతాల్లో గాంధీయిజంపై వ్యతిరేకత ఉంది. దేశ విభజనకు ఆయనే కారణం అని బీజేపీ సిద్దాంతాలను నమ్మేవారు భావిస్తారు. అందుకే ఆయనను చంపిన గాడ్సేను కూడా సమానంగా ఆదరిస్తారు. గాడ్సే అసలు ఆరెస్సెస్ వ్యక్తి.
కారణం ఏదైనా మహాత్ముడ్ని బీజేపీ అంత దగ్గరకు తీయదు. పటేల్ కు ప్రాధాన్యం ఇస్తుంది. మహాత్ముడు హత్యకు గురైన తరవాత ఆయన చితాభస్మాన్ని పదకొండు నదుల్లో కలిపారు. అందులో మూసి ఒకటి. లంగర్ హౌస్ వద్ద మూసి వద్ద ఈ చితా భస్మాన్ని కలపడంతో అక్కడ బాపూ ఘాట్ నిర్మించారు. ఇప్పుడు ఆ ప్లేస్లోనే పటేల్ విగ్రహాం కన్నా పెద్ద మహాత్ముడి విగ్రహం పెడతానని అంటున్నారు. అంటే… మహాత్ముడ్ని బీజేపీ కించ పరిచిందని ప్రజల్లోకి తీసుకెళ్తారన్నమాట. రేవంత్ ప్లాన్లు అలాగే ఉంటాయి మరి !