కథల్ని రీమేక్ చేయడం ఎలాగో, పాటల్ని రీమిక్స్ చేయడం అలా. పాత పాటల్ని తీసుకొని, వాటికి కొన్ని కొత్త హంగులు అద్ది, ఈతరం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం రీమిక్స్ లక్ష్యం. తెలుగులోనూ చాలా పాటల్ని రీమిక్స్ రూపంలో చూశాం. విన్నాం. అందులో కొన్నే సక్సెస్ అయ్యాయి. ఇంకొన్ని పాటలు విని ప్రేక్షకులు, శ్రోతలు పెదవి విరిచారు. మంచి పాటల్ని పాడు చేశారన్న కామెంట్లు విరివిగా వినిపించాయి. అసలు రీమిక్స్ చేయడమే తప్పంటూ… ఇప్పుడు ఏ.ఆర్.రెహమాన్ కొత్త స్వరం వినిపిస్తున్నారు. పాత పాటల్ని రీమిక్స్ చేసే అధికారం ఎవరు ఎవరికి ఇచ్చారు? అంటూ ప్రశ్నిస్తున్నారు. రెహమాన్ పాటని బాలీవుడ్లో ఓ సంగీత దర్శకుడు రీమిక్స్ చేసినప్పుడు కూడా ఆ పాట తనకు నచ్చలేదని, వర్జినల్ సాంగ్ లో ఉండే ఫీల్ ని పాడు చేశారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్త పరిచారు. రీమిక్స్ వల్ల పాత పాటల్లోని మాధుర్యం పోతోందన్న మాట వాస్తవం. ఈ విషయంలో సందేహాలకు తావు లేదు. అయితే… రీమిక్స్ రూపంలో వర్జినల్ పాట సృష్టికర్తలకు భారీ మొత్తంలో డబ్బులు అందుతున్నాయి. ఓ పాటని రీమిక్స్ చేయాలంటే అంత సులభం కాదు. ఆ పాట హక్కులు ఎవరి దగ్గర ఉన్నాయో, వాళ్ల అనుమతి కావాలి. కాపీ రైట్ ప్రకారం భారీ మొత్తం చెల్లించాలి. అందుకు సిద్ధమైతేనే రీమిక్స్ రైట్స్ దక్కుతాయి. సాధారణంగా ఓ పాటకు సంబంధించిన హక్కులు ఆడియో కంపెనీ, నిర్మాత, స్వరకర్త, పాటల రచయితల దగ్గర ఉంటాయి. కాపీ రైట్ ప్రకారం, పాటకు రీమిక్స్ రూపంలో వచ్చిన మొత్తం వీళ్లు పంచుకొంటారు. ఇటీవల ఓ స్టార్ హీరో సినిమా కోసం హిందీలో సూపర్ హిట్ అయిన ఓ ఓల్డ్ క్లాసిక్‌ని రీమిక్స్ చేద్దామనుకొన్నారు. ఆ హక్కులు టీసిరీస్ దగ్గర ఉన్నాయి. కాపీ రైట్ కోసం వాళ్లని సంప్రదిస్తే దాదాపు రూ.5 కోట్ల వరకూ అడిగారని తెలుస్తోంది. ఒక్క పాటకు రూ.5 కోట్లు వెచ్చించడం అనేది చాలా పెద్ద విషయం. అందుకే ఈ విషయంలో తెలుగు నిర్మాతలు తర్జన భర్జనలు పడుతున్నారు. ఈ రూ.5 కోట్లు సంగీత దర్శకుడు, నిర్మాత, ఆడియో కంపెనీ, గీత రచయిత వీళ్లంతా పంచుకొంటారు. అలాంటప్పుడు.. రెహమాన్ పాటకు కూడా డబ్బులు వచ్చి ఉంటాయి కదా? రెహమాన్ అనుమతి లేకుండా పాటలెలా వాడతారు? ఇవన్నీ కొత్తగా పుట్టే సందేహాలు. ఈ ఇంటర్వ్యూలో రెహమాన్ మరో కొత్త అంశాన్ని ప్రస్తావించారు. ఏఐ ఉపయోగించి ట్యూన్లు సిద్ధం చేయడం.. పాతతరం నటీనటుల గొంతుల్ని ఏఐని అడ్డు పెట్టుకొని పునః సృష్టించడం వల్ల కొత్త తరం స్వరకర్తలకూ, గాయనీ గాయకులకు పని దొరకడం కష్టం అవుతుందని, చాలా మంది ఉపాధి కోల్పోతారన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ వాస్తవం. ఏఐ వల్ల భవిష్యత్తులో చాలామంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోతారు. ఆ ప్రమాదం అందరికంటే చిత్రసీమకు ఎక్కువ పొంచి ఉంది.