నటుడిగా, ప్రజా ప్రతినిధిగా బిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. మరోవైపు బసవతారకం ఆసుపత్రికి సంబంధించిన పనులు కూడా దగ్గరుండి చక్కబెడుతుంటారు. అన్స్టాపబుల్ లాంటి షోలు సరే సరి. ఆయనకు ఎప్పటి నుంచో… ఓ స్టూడియో నిర్మించాలన్నది ఆశ. చాలాకాలంగా ఈ విషయమై కసరత్తులు చేస్తున్నారు. అప్పట్లో ఏపీలో బాలయ్య స్టూడియో కట్టుకోవడానికి తగిన స్థలం కూడా కేటాయించారన్న వార్తలొచ్చాయి. అయితే మధ్యలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ ప్రతిపాదనలు పక్కన పెట్టేశారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా బాలయ్యకు తెలంగాణలో స్టూడియో కట్టుకోవడానికి అనుకూలంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోబోతోందని తెలుస్తోంది. బాలకృష్ణ స్టూడియో కోసం రెవిన్యూ శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు, అనువైన స్థలం కేటాయించినట్టు వార్తలొస్తున్నాయి. త్వరలోనే అధికారికంగా ఈ విషయం బయటకు రానుంది.
నిజానికి ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. బాలయ్య గట్టిగా ఒత్తిడి తీసుకొస్తే, ఏపీలో స్టూడియోకి తగిన స్థలం ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇందులో అనుమానం ఏం లేదు. కానీ అలా స్టూడియో కోసం బాలయ్య స్థలం దక్కించుకొంటే, విపక్షం నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. సొంత మనుషులకు స్థలాలు ఇచ్చుకొంటూ పోతారా? అంటూ ఆ ప్రయత్నానికి అడ్డు పడవొచ్చు. అందుకే ఇప్పుడు తెలంగాణలో స్టూడియో నిర్మించడానికి ఆసక్తి చూపించారని అర్థమవుతోంది. బసవతారకం ఆసుపత్రిని ఏపీలో నిర్మించాలన్నది ఆయన ఆలోచన. త్వరలోనే అందుకు తగిన అనుమతులు, స్థలం కూడా బాలయ్యకు మంజూరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో బసవతారం, తెలంగాణలో స్టూడియో.. ఇవి రెండూ బాలయ్య చిరకాల కోరికలు. ఇవి ఇప్పటికి నెరవేరుతున్నాయి.