‘పొట్టేల్’ సక్సెస్ మీట్ లో రివ్యూ రైటర్లపై చాలా హేయమైన వ్యాఖ్యలు చేశారు సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్. షార్ట్ ఫిల్మ్ తీయడం చేతకానివాళ్లు సైతం రివ్యూలు రాస్తున్నారంటూ, రివ్యూ రైటర్లపై రాయడానికి వీలు కాని భాషలో తిట్ల దండకం అందుకొన్నారు. దీనిపై మీడియా వర్గాలు మండి పడుతున్నాయి. విమర్శించడంలో తప్పు లేదని, అయితే శ్రీకాంత్ వాడిన భాష ఏమాత్రం సమంజసంగా లేదని మీడియా మొత్తం ముక్తకంఠంతో నినదిస్తోంది. ఈ మేరకు జర్నలిస్టులపై అసభ్య పదజాలం వాడిన శ్రీకాంత్ అయ్యంగార్ పై చర్య తీసుకోవాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కు క్రిటిక్స్ అసోసియేషన్ ఓ లేఖ రాసింది. శ్రీకాంత్ వాడిన భాష జర్నలిస్టుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో పేర్కొంది.
డిజిటల్ మీడియా అసోసియేషన్ కూడా అయ్యంగార్ వ్యాఖ్యల్ని ఖండించింది. రివ్యూ రైటర్లకు క్షమాపణలు చెప్పేంత వరకూ నటుడు అయ్యంగార్ పాల్గొనే ప్రెస్ మీట్లకు కవరేజీ అందించకూడదని నిర్ణయించుకొంది. ఓ నటుడ్ని మీడియా బ్యాన్ చేయడం ఈమధ్యకాలంలో ఇదే తొలిసారి. శ్రీకాంత్ అయ్యంగార్ చేతిలో దాదాపు 10 సినిమాలున్నాయి. పెద్ద సినిమాల విషయంలో మీడియా కవరేజ్‌కి లోటు ఉండదు. కానీ చిన్న సినిమాలు ఈ విషయంలో ఇబ్బంది పడతాయి. జర్నలిస్టుల విజ్ఞప్తిని ‘మా’ ఎలా తీసుకొంటుందన్నది కూడా ఆసక్తికరమైన అంశం. ‘మా’లో సభ్యత్వం ఉన్న నటీనటులపై ఎవరైనా అసందర్భంగా మాట్లాడినా, వాళ్ల పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తించినా సినీ జర్నలిస్టులు సదరు నటీనటులకు అండగా నిలబడి, వాళ్ల తరపున పోరాడుతున్నారు. ఇప్పుడు జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ‘మా’ ఎలా స్పందిస్తుందో చూడాలి.