కుటుంబ సమస్యను రోడ్డున పడేసుకున్న జగన్ రెడ్డి సొంత చెల్లి షర్మిలపై తప్పుడు ఆరోపణలు, నిందలు, తమదైన మార్క్ ఆరోపణలతో వైసీపీ నేతలతో విరుచుకుపడేలా చేస్తున్నారు. ఫోన్లు చేసి,. స్క్రిప్టులు పంపి మరీ షర్మిలను తిట్టాలని వైసీపీ నేతలకు సందేశాలు పంపుతున్నారు. ఇలా పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నుంచి గుడివాడ అమర్నాథ్ వరకూ అందరూ ప్రెస్మీట్లు పెట్టి షర్మిలను తిడుతున్నారు. చంద్రబాబుకు మేలు చేసేందుకే ఆమె జగన్ పై ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు.
ఇలా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికీ నిజం ఏమిటో తెలుసు. అయినా వారికి మరో ఆప్షన్ లేదు. పార్టీ ఆఫీసు నుంచి సమాచారం వచ్చింది కాబట్టి మాట్లాడాల్సిందే. లేకపోతే గుడ్ బుక్ లో పేరు రాసుకోరు. ఈ విషయాన్ని జగన్ వ్యక్తిగత అంశంగా కాంకుడా రాజకీయం చేస్తున్నారు. తల్లి, చెల్లిపై ఎన్సీఎల్టీలో పిటిషన్ వేయడం ఎంత దారుణం అయిన తప్పిదమో ఆయన తెలియడానికి ఎంతో కాలం పట్టదు.కానీ ఆ తప్పును రాజకీయం చేసి తాను ఏం చెప్పినా నమ్మేవాళ్ల చెవులలో క్యాలిఫ్లవర్లను పెట్టడానికి… ఒక్క మాటను వంద మందితో చెప్పిస్తే అదే నిజం అవుతుదనుకున్నట్లుగా సీన్ మారుతోంది.
వైసీపీ నేతలు అయినా కాస్త ఆలోచన చేయాల్సింది. అది జగన్ రెడ్డి కుటుంబ వ్యవహారం. జగన్ ఎంత ఒత్తిడి తెచ్చినా షర్మిల తన వాటా తనకు ఇవ్వాల్సిందేనంటున్నారు. ఆమె రాజకీయంగా నిలబడితే భూస్థాపితం అయ్యేది జగన్ పార్టీనే. ఇప్పుడు షర్మిలపై సహజంగానే సానుభూతి పెరుగుతుంది. వైసీపీ ఓటర్లలో ఐదు శాతం మారినా అది జగన్ రెడ్డికి ఆయన పార్టీకి అంతిమ తీర్పు అవుతుంది. ఎన్నికలు దగ్గరో లేవు కాబట్టి అప్పటికి ఏదైనా మారుతుందని అనుకోవచ్చు. కానీ ఏదైనా జగన్ రెడ్డి మనస్థత్వాన్ని బట్టే ఉంటుంది. ఎన్నికల సమయానికి సోదరిని ఎలాగైనా బుజ్జగిస్తారేమో కానీ అప్పుడు బలయ్యేది ఇప్పుడు మాట్లాడిన నేతలే. ఎందుకంటే వారు వారు కుటుంబసభ్యులు. మిగతా వారంతా బయటవాళ్లే. ఈ సూక్ష్మాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకుంటారో లేదో మరి !