శ్రీశైలం పాతాళగంగలోని కృష్ణానది , బెజవాడ ప్రకాశం బ్యారేజీ ల్యాండింగ్ పాయింట్లుగా సీ ప్లేన్ సర్వీసును ప్రభుత్వం ప్రారంభించనుంది. శ్రీశైలంలో నవంబర్ 9న ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. లాంఛనంగా సీప్లేన్ సర్వీసును ప్రారంభించనున్నారు. ఈ ప్లేన్ సర్వీస్ కోసం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కృషి చేశారు. గాలిలో ఎగర గలిగే, నీటిపై తేలగలిగే, ఎక్కడైనా ల్యాండ్ అవ్వగలిగే కెపాసిటీ ఉన్న ఈ సీ ప్లేన్స్ అమెరికా, మాల్దీవులు వంటి దేశాలలో పర్యాటకంగా అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరప్రాంతం అధికంగా ఉన్న నేపథ్యంలో పర్యాటకంగా ఏపీకి ఇది బాగా ఉపయోగపడుతుందని రామ్మోహన్ నాయుడు ఈ ప్రాజెక్టు ఏపీకి వచ్చేలా కృషిచేశారు. ఈ విమానాలు పర్యాటకంగానే కాకుండా మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో, ఏవైనా ప్రకృతి విపత్తుల సమయంలో కూడా ఉపయోగపడతాయి. కేంద్రం సీ ప్లేన్ విధానాన్ని ప్రవేశపెట్టిన వెంటనే దానిని ఏపీలో అమలు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఆ ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
సీప్లేన్ అందుబాటులోకి వస్తే పర్యాటకంగా అటు విజయవాడ, ఇటు శ్రీశైలంకు మంచి బూస్టప్ అవుతుంది. పర్యాటకులు ఒకే రోజు తక్కువ వ్యవధిలో రెండు పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం లభిస్తుంది. ప్రజాదరణ ఉంటే మరిన్ని సీ ప్లేన్ సౌకర్యలను ఇతర చోట్లకూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయి.