దిల్ రాజు బ్యానర్ నుంచి ఈ సంక్రాంతికి రెండు సినిమాలు రావడం ఖాయమైపోయింది. ఒకటి… ‘గేమ్ ఛేంజర్’. రెండోది వెంకటేష్ సినిమా. డిసెంబరుకు రావాల్సిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. అయితే సంక్రాంతి సీజన్‌ని క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో జనవరి 10కి వాయిదా వేశారు. వెంకటేష్ – అనిల్ రావిపూడి సినిమా కూడా సంక్రాంతికే రావాలి. అయితే ‘గేమ్ ఛేంజర్‌కు’ పోటీ పెద్దగా ఉండకూడదన్న ఉద్దేశంతో వెంకీ సినిమాని వాయిదా వేస్తారేమో అనుకొన్నారంతా. అయితే.. అలాంటివేం జరగడం లేదు. ‘గేమ్ ఛేంజర్’ ఉన్నా సరే, వెంకటేష్ సినిమాని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
వెంకీ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయిపోయింది. ఈరోజు నుంచి డబ్బింగ్ కూడా మొదలెట్టేశారు. ‘సంక్రాంతికి విడుదల’ అంటూ చిత్రబృందం కూడా డిక్లేర్ చేసేసింది. జనవరి 10న ‘గేమ్ ఛేంజర్’ వస్తుంది. 12.. బాలయ్య సినిమా రావొచ్చు. 13 లేదా 14న వెంకటేష్ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. వెంకటేష్ చిత్రాలకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి మద్దతు ఉంటుంది. అనిల్ రావిపూడి చిత్రాలు సైతం కుటుంబ సమేతంగా చూసేలా ఉంటాయి. ఫ్యామిలీ చిత్రాలకు సంక్రాంతి బెస్ట్ ఆప్షన్. అందుకే వెంకీ సినిమాని ఇదే సీజన్లో విడుదల చేయాలని దిల్ రాజు ఫిక్సయిపోయారు.
వచ్చే వారంలో సంక్రాంతికి సినిమాలు విడుదల చేద్దామనుకొంటున్న నిర్మాతలంతా కలిసి ఓ మీటింగ్ ఏర్పాటు చేసుకొంటున్నారని టాక్. ఈ సమావేశంలో రిలీజ్ డేట్ ల గురించి చర్చించుకొంటారని, ఆ తరవాతే… సంక్రాంతి సినిమాలపై ఫుల్ క్లారిటీ వస్తుందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సంక్రాంతికి సందీప్ కిషన్, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలతో పాటుగా తమిళనాట నుంచి ‘గుడ్ బాడ్ అగ్లీ’ సినిమా కూడా రాబోతోంది. ‘తండేల్’ కూడా పోటీలో ఉంది. అయితే రిలీజ్ డేట్ విషయంలో అల్లు అరవింద్ ఓ నిర్ణయం తీసుకోవాల్సివుంది.