జన్వాడ ఫామ్‌హౌస్‌లో లిక్కర్ పార్టీ వ్యవహారంలో రాజ్ పాకాల పారిపోవడంతో చిన్న విషయం కాస్తా అతి పెద్దదిగా మారినట్లుగా కనిపిస్తోంది. మామూలుగా అది లిక్కర్ పార్టీనే. అనుమతి లేకుండా మద్యం ఈవెంట్ నిర్వహిస్తున్నారని చిన్న కేసు పెట్టే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఫామ్ హౌస్ ఓనర్, పార్టీ హోస్ట్ రాజ్ పాకాల ఎప్పుడైతే కనిపించకుండా పారిపోయారో అప్పుడు ఇది పెద్ద విషయం అయిపోయింది పార్టీలో పాల్గొన్న వారికి చేసిన టెస్టుల్లో ఒకరికి కొకైన్ పాజిటివ్‌గా తేలడం.. ఆయన తనకు రాజ్ పాకాలనే కొకైన్ ఇచ్చారని చెప్పడంతో విషయం పెద్దది అయిపోయింది.
రాజ్ పాకాలకు పారిపోయే అవకాశం పోలీసులే ఇచ్చి ట్రాప్ చేశారేమో తెలియదు కానీ.. ఆయన కనిపించకపోవడంతో ఎక్సైజ్ పోలీసులు ఓరియన్ విల్లాస్ లోని ఆయన ఇంట్లో సోదాలకు ప్రయత్నించారు. ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తాళాలు బద్దలుకొట్టి సోదాలకు ప్రయత్నించారు. తర్వాత నంది నగర్‌లోని కేటీఆర్ ఇంటి వద్ద కూడా పోలీసులు మోహరించడంతో వివాదాస్పదమయింది. ఈ వ్యవహారాన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియక బీఆర్ఎస్ తంటాలు పడుతోంది. అది కేవలం కుటుంబ పార్టీనేనని కుటుంబాలను రోడ్డు మీదకు లాగుతారా అని ప్రశ్నిస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో రాజకీయ ప్రత్యర్థులపై ఎన్నో సార్లు ట్రాప్ కేసులు పెట్టారు. అసలు నేరం ఏమీ లేకపోయినా పక్క రాష్ట్ర రాజకీయల కోసం కూడా ఇలాంటి కేసులు పెట్టారు. అలాంటి కేసులు గుర్తొచ్చిన వారంతా.. తెలంగాణ సర్కార్ సరైన దెబ్బకొట్టిందని అంటున్నారు. ఏది ఇస్తే అది తిరిగి వస్తుందని అంటున్నారు. ఈ అంశంపై కేటీఆర్ వైపు నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు. రాజ్ పాకాల పారిపోకుండా పోలీసులకు అందుబాటులో ఉన్నట్లయితే ఇంత సంచలనం అయ్యేది కాదన్న వాదన వినిపిస్తోంది.