తమిళనాట కొత్త పార్టీ పెట్టుకున్న దళపతి విజయ్ తమ పార్టీ మొదటి మహానాడు “మానాడు”తో బలప్రదర్శన చేశారు. ప్రధాన పార్టీలకు బహిరంగసభలు నిర్వహిస్తే ఎంత ఎక్కువగా బలప్రదర్శన చేస్తారో అలాగే చేశారు. తమిళనాడు నలుమూల నుంచి అభిమానులను సమీకరించారు. తన బలం ప్రదర్శించడం ద్వారా ప్రధాన పార్టీలకు తాను కూడా బలమైన పోటీ దారుడినేనని సంకేతం పంపారు. తమిళగ వెట్రి కళగంలో ఇప్పటి వరకూ ఆయన అభిమాన సంఘాలే కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఈ సభలో తన పార్టీ భావజాలం గురించి విజయ్ ప్రకటించారు. అయిన కూడా పూర్తిగా డీఎంకే బాటలో పయనిస్తున్నారు. ఒకటే కులం.. ఒకరే దేవుడు అనే నినాదం వినిపించిన డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై విధానమే తన విధానమని ప్రకటించారు. అన్నాదురై విజయ్ నడిపిస్తున్నట్లుగా ఉన్న గ్రాఫిక్ ను కూడా ప్రదర్శించారు. పార్టీలో అందరూ సమానమేనని తరలి వచ్చిన అభిమానులకు స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో చిన్నపిల్లాడినే కావొచ్చు కానీ ఎవరికీ భయపడేది లేదన్నారు.. సినిమాల కల్లా రాజకీయాలపైనే తాను ఎక్కువ దృష్టి పెట్టానని చెప్పారు. డీఎంకే ఆశయాలు, ఆదర్శలే చెప్పడంతో భావజాలం ప్రకారం తమిళనాడులోని అ అన్నిపార్టీలు .. ఒక్క బీజేపీ మినహా అన్నీ ఒకే తరహా అనుకోవచ్చు.
సినిమా హీరోలకు జనాలు రావడం అన్నది పెద్ద విషయం కాదు. రజనీకాంత్ తరవాత ఆ స్థాయి స్టార్ ఇమేజ్ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ తన రాజకీతయ పార్టీ ద్వారా భారీ స్థాయిలో జన సమీకరణ చేయడం పెద్ద విషయం కాదు. కానీ తన ఐడియాలజీతో వాటిని ఓట్లుగా మల్చుకోవడమే అసలైన సవాల్‌గా భావిస్తున్నారు.