ముద్రగడ పద్మనాభం రాజకీయ పార్టీ స్థాపించబోతున్నారా? అందుకే కాపులకి రిజర్వేషన్ల కోసం అకస్మాత్తుగా పోరాటం మొదలుపెట్టి రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారా? కొన్ని రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే అవుననే భావించవలసి వస్తోంది.
2014ఎన్నికల సమయంలో ఆయన తెదేపా టికెట్ పై పెద్దాపురం నుంచి పోటీ చేద్దామనుకొన్నారు. కానీ తెదేపా ఆయనకి జగ్గంపేట నుంచి అవకాశం ఇస్తే దానిని ఆయన తిరస్కరించారు. ఒకవేళ ఆయన జగ్గంపేట నుంచి ఆయన పోటీచేసి గెలిచి ఉండి ఉంటే ఏమయ్యేది? అంటే బహుశః నేడు ఈ ఉద్యమాలు చేసి ఉండేవారు కారని అర్ధమవుతుంది. ఆయన ఉద్యమానికి అది కారణమో కాదో ఖచ్చితంగా చెప్పలేము కానీ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ శ్యూన్యత భాజపాని ఊరిస్తున్నట్లుగానే బహుశః ముద్రగడని కూడా ఊరిస్తోందేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదో ఒక పార్టీలో చేరడం కంటే కాపుల మద్దతుతో స్వంత పార్టీ పెట్టుకొంటే 2019లలో తెదేపాపై ప్రతీకారం తీర్చుకోవచ్చని ఆయన భావిస్తే అసహజమేమీ లేదు.
ఒకప్పుడు చిరంజీవి కూడా రాష్ట్రంలో తన అభిమానుల ఓట్లతో బాటు కాపుల ఓట్లన్నీ కూడా గంపగుత్తగా తనకే పడతాయనే భ్రమతోనే ప్రజారాజ్యం స్థాపించిన సంగతి తెలిసిందే. తరువాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా అందరూ అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ తెదేపా, భాజపాలకు మద్దతు ప్రకటించడంతో కాపుల ఓట్లు అన్నీ వారి ఖాతాలో పడ్డాయని లెక్కలు తేలాయి. వారి ప్రేరణతోనే ముద్రగడ పద్మనాభం కూడా స్వంత పార్టీ పెట్టుకోవాలనే ఆలోచన కలిగి ఉండవచ్చు. దాని కోసమే ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు అనుమానం కలుగుతోంది. తనకీ అవమానాలు కలిగించిన వారు సర్వనాశనం అయిపోతారని, దేవుడు కరుణించేవరకు తన ఇంట్లో పండుగలు శుభకార్యాలు చేసుకోనని ముద్రగడ దీక్ష విరమించిన తరువాత భీకర శపథం చేయడం కూడా ఈ అనుమానాలకి బలం చేకూరుస్తోంది.
ఈ అనుమానాలకి బలం చేకూర్చే రాజకీయ పరిణామం ఒకటి నిన్న జరిగింది. మాజీ ఎంపిలు హర్ష కుమార్, చింతా మోహన్ నిన్న కిర్లంపూడిలో ఆయన నివాసంలో సమావేశం అయిన తరువాత మీడియాతో మాట్లాడుతూ “రాష్ట్రంలో కాపులు, దళితులు కలిసి పనిచేస్తే రాజ్యాధికారం దక్కించుకోవచ్చు. మేము ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము,” అని అన్నారు.
కాపులు, దళితులు కలిసి పనిచేస్తే రాజ్యాధికారం దక్కించుకోవచ్చనే వారి మాటలకి అర్ధం ఆ రెండు వర్గాల ప్రజలకి ప్రాతినిద్యం వహించే రాజకీయ పార్టీ స్థాపన చేయడమేనని స్పష్టం అవుతోంది. ఆ రెండు వర్గాల ప్రజలకి వేరే ప్రత్యమ్నాయం లేనందున ప్రస్తుతం తెదేపా, వైకాపా, కాంగ్రెస్ పార్టీల మధ్య చీలిపోయున్నారు. కనుక ముద్రగడ నేతృత్వంలో పార్టీని స్థాపించి వారిని ఆకట్టుకోగలిగితే రాజ్యాధికారం దక్కించుకోవచ్చని హర్ష కుమార్ విస్పష్టంగా చెపుతున్నట్లు అర్ధం అవుతోంది. హర్ష కుమార్ వంటి రాజకీయ నిరుద్యోగులు రాష్ట్రంలో ఇంకా చాలా మంది ఉన్నారు. మరికొందరు తెదేపా, వైకాపాలో కూడా ఉన్నారు. 2019 ఎన్నికలనాటికి ముద్రగడ తెదేపాకి బలమైన ప్రత్యామ్నాయంగా అవతరించగలిగితే వారందరూ కూడా గోడ దూకేసి ఆయన పంచన చేరడం తధ్యం.
ముద్రగడ వెనుక జగన్ ఉన్నారని తెదేపా నేతలు పదేపదే చేస్తున్న ఆరోపణలని పూర్తిగా కొట్టిపారేయలేము. ఎందుకంటే వచ్చే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి జీవన్మరణ సమస్య వంటివి. ఎట్టి పరిస్థితులలో కూడా వైకాపా గెలవడం చాలా అవసరం లేకుంటే వైకాపాని మూసేసుకోవలసి రావచ్చు. కనుక ముద్రగడకి మద్దతు ఇచ్చి తెదేపాని దెబ్బ తీసి, ఆయన మద్దతుతో అధికారంలోకి రావాలనే ఆలోచనతోనే ముద్రగడ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారేమోననే అనుమానం ఉంది.
ఇప్పటికే ముద్రగడ తన దీక్షలతో తెదేపా పట్ల కాపులలో వ్యతిరేకత ఏర్పరచగలిగారు. కనుక ఒకవేళ స్వంత కుంపటి పెట్టుకోగలిగితే దాని వలన ఆయనకి, ఆయన ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తున్న కాపు నేతలకీ లాభమే తప్ప నష్టం ఉండదు. ఒకవేళ స్వంత కుంపటి పెట్టుకోలేకపోయినా వచ్చే ఎన్నికలలో వైకాపాకి మద్దతు ఇచ్చినా సరిపోతుంది. ముద్రగడ స్వంత పార్టీ పెట్టుకొన్నా, పెట్టుకోకపోయినా వచ్చే ఎన్నికలలో తెదేపాని ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డటం ఖాయమని భావించవచ్చు.