తెలంగాణ రాజకీయాల్లో ఆదివారం అంతా బిజీబిజీగా గడిచిపోయింది. ఓ చిన్న ఫ్యామిలీ పార్టీలో చేసిన అతి చిన్న తప్పుల వల్ల కేసీఆర్ కుటుంబ వ్యవహారం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. కాస్త ఆలోచిస్తే వారు చేసింది పెద్ద కేసు కాదు. అది పూర్తిగా ఫ్యామిలీ పార్టీ అని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. కేటీఆర్ చెప్పినట్లుగా కుటుంబసభ్యులు, ఆత్మీయులకే రాజ్ పాకాల పార్టీ ఇచ్చారు. డబ్బులకు ఆార్గనైజ్ చేసిన పార్టీ కాదు. మరి వివాదం ఎక్కడ నుంచి వచ్చిందంటే… నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని అందరూ అనుకోవాల్సిన పరిస్థితి.
బీఆర్ఎస్ హయాంలో ఎన్నో కుట్రల కేసులు
రాజకీయం అంటే రాజకీయ ప్రత్యర్థుల్ని ట్రాప్ చేసి కేసులతో మానసికంగా కుంగదీయడం అనే భావన తెలంగాణ ఏర్పడిన తర్వాత పెరిగిపోయింది. బీఆర్ఎస్ హయాంలో ఇలా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ రాజకీయ కుట్రలు జరిగాయి. ఏమీ లేకపోయినా ఏదో చేసేసినట్లుగా పోలీసులు కేసులు పెట్టి.. దాన్ని విశ్లేషించి.. సంబంధిత వ్యక్తులని అరెస్టు చేసి రోజుల తరబడి జైళ్లలో ఉంచారు. ఇష్టం వచ్చినట్లుగా ప్రచారాలు చేశారు. ఆ బాధలు అనుభవించిన వారంతా ఇప్పుడు పదవుల్లో ఉన్నారు. నిజానికి బీఆర్ఎస్ హయాంలో ఇలా కుట్రల బారిన పడని పార్టీ నేతలు లేరంటే అతిశయోక్తి కాదు.
బీఆర్ఎస్ హయాంలో అన్ని పార్టీలు బాధితులే !
మొదట ఓటుకు నోటు పేరుతో రేవంత్ రెడ్డిని ట్రాప్ చేశారు. సీఎంగా ఉన్న చంద్రబాబు ఫోన్లనూ ట్యాప్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ బీజేపీని ట్రాప్ చేశారు. నేరుగా బీజేపీ అగ్రనేతల్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. సొంత రాజకీయాల కోసం కాదు పక్క రాష్ట్రాల రాజకీయ మిత్రుల కోసం డేటా చోరీ అంటూ మరో గేమ్ ఆడారు. ఇవన్నీ మచ్చుకు మాత్రమే. పదేళ్ల కాలంలో అధికారం ఉందని అడ్డగోలుగా చేసిన ఎన్నో అధికార దుర్వినియోగపనులు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి. అందుకే కనీసం సానుభూతి దక్కకుండా చేస్తున్నాయి.
రాజకీయాల్లో చేసినదానికి రివర్స్ గ్యారంటీ !
రాజకీయాల్లో ఓ సైకిల్ ఉంటుంది. ఇవాళ శిఖరం మీద ఉంటే రేపు కింద ఉంటారు. కానీ శిఖరం దాకా వెళ్లిన వారు ఇక తాము అక్కడే ఉంటామన్న ఓ మానసిక స్థితికి చేరుకుని అడ్డగోలు తప్పుుడు పనులు చేసి వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తూంటారు. వేరేవారికి పవర్ వచ్చినప్పుడు అంతకు మించి చేయకపోతే చేతకాని వాళ్లు అని ముద్రపడేలా చేస్తారు. అందుకే చేసిన దానికి అనుభవించక తప్పదని అనుకోవచ్చు. బహుశా ఇది ఓపెనింగే.