జగన్ రెడ్డి హయాంలో విద్యుత్ కోతల గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ కోతలకు తోడు పెద్ద ఎత్తున బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేసేవారు. రూపాయికి వచ్చే కరెంట్ ను సండూర్ నుంచో మరో కమిషన్లు ఇచ్చిన కంపెనీ నుంచో రెండుకు కొనేవారు. ఒక్కో సందర్భంలో యూనిట్ రూ. పది కూడా ఖర్చు పెట్టి కొన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ భారం అంతా ఎవరు మోయాలి.. ప్రజలే. అందుకే జగన్ రెడ్డి హయాంలో పెంపు ప్రతిపాదనలు వెళ్లాయి. ఆయన నియమించిన ఎలక్ట్రిక్ రెగ్యూలేటరి కమిషన్ చైర్మన్ ఆ ప్రతిపాదనల్ని ఎన్నికల సమయంలో పక్కన పెట్టి ఇప్పుడు రిటైర్ అయ్యే ముందు ఆమోదిస్తున్నారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగానే జరుగుతోంది.
జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్లలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. ఎన్నికలకు ముందు మరోసారి ఏపీ ప్రజల మీద 2023-24 సంవత్సరానికి గాను మరో రూ.11,826.42 కోట్ల భారం వేయడానికి ఏర్పాట్లు చేశారు. రెండేళ్ల క్రితమే ఈ మొత్తాన్ని డిస్కంలు ప్రజల నుంచి వసూళ్లు చేస్తామని ఈఆర్సీని కోరినా వాయిదా వేస్తూ వచ్చారు. చివరగా 2024 మార్చి నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేయాలని నిర్ణయించారు. ఎన్నికలు ఉన్నందున ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందని వాయిదా వేశారు. ఈ డబ్బులన్నీ జగన్ రెడ్డి చేసిన దోపిడీనేనని టీడీపీ వర్గాలంటున్నాయి.
జగన్ రెడ్డి హయాంలో తీసుకున్న అనాలోచితన నిర్ణయాలతోనే ప్రజలపై విద్యుత్ సర్దుబాటు చార్జీల భారం పడిందని సులువుగా అర్థం చేసుకోవచ్చు. అయితే జగన్ మాత్రం… తాను చేసిన తప్పుల్ని చాలా తెలివిగా టీడీపీపై నెట్టేస్తున్నారు. చంద్రబాబు రేట్లు పెంచుతున్నట్లుగా ప్రకటిస్తుతున్నారు. ఇదేనా దీపావళి కానుక అంటున్నారు. నిజానికి ఆయన ఇచ్చిన షాకుల్ని ప్రజలు పండగలకూ భరిస్తున్నారు. అత్యంత ఘోరమైన పాలన చేసిన జగన్ నిర్వాకాల భారాన్ని ప్రజలు మరో రెండేళ్ల వరకూ భరించాల్సిందే.