ఆస్తుల విషయంలో వైఎస్ కుటుంబంలో జరిగుతున్న పంచాయతీ విషయంలో ఇక చర్చ ఆపేద్దామని వైసీపీ పిలుపునిచ్చింది. తమ పార్టీ కార్యకర్తలకు ఈ సందేశాన్ని సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఇచ్చారు. ప్రస్తుతం విషయం కోర్టులో ఉందని అక్కడే తేల్చుకుందామని ఇందులో రాజకీయ చర్చలకు తావు లేదని వైసీపీ చెప్పుకొచ్చింది. ఇక ప్రభుత్వంపై పోరాడాల్సిన సమయం వచ్చిందని.. హామీల కోసం ప్రభుత్వాన్ని నిలదీద్దామని ట్వీట్లో పిలుపునిచ్చారు.
అయితే అసలు ఎవరు ప్రారంభించారు ? అంటే.. ఇక్కడ వైసీపీనే అని చెప్పక తప్పదు. తల్లి, చెల్లిపై కోర్టుకెక్కిన తరవాత … ఓ మాజీ సీఎం వింత మనస్థత్వంపై ప్రజలు చర్చించుకోకుండా ఉంటారా ?. ఆయన ప్రత్యర్థులు ప్రశ్నించకుండా ఉంటారా ?. ఆ ప్రశ్నలకు సమాధానం రాజకీయంగా చెప్పి ఉంటే సమస్య ఉండేది కాదు. కానీ అసలు పరిష్కారం షర్మిలను తిట్టించడమే అన్నట్లుగా వైసీపీ నేతల్ని ఉసిగొలిపారు. ఒకరి తర్వాత ఒకరు షర్మిలపై దారుణమైన ఆరోపణలు చేస్తూ వెళ్తున్నారు.
సొంత చెల్లిపై జగన్ రెడ్డి చేయిస్తున్న విష ప్రచారం వల్ల ఎంత మంది షర్మిలను వ్యతిరేకిస్తారో కానీ జగన్ కోసం కష్టపడిన షర్మిల విషయంలో మాత్రం ఎక్కువ సానుభూతి కనిపిస్తోంది. జగన్ రెడ్డి అప్పనంగా వచ్చిన సొమ్మును పంచడానికి కూడా వేధిస్తున్నాడని అనుకుంటారు. ఈ పొలిటికల్ గేమ్ ప్రారంభిచింది వైసీపీనే. ఇప్పుడు ఆపేద్దామంటోంది కూడా వైసీపీనే. కానీ ఒక సారి నిప్పు రాజేశాక.. ఆపడం రాజేసిన వారి చేతుల్లో కూడా ఉండదు కదా !