త్రిష ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పాతికేళ్లయ్యింది. అయితే అప్పటికీ ఇప్పటికీ ఎలాంటి మార్పూ లేదు. అదే ఛార్మ్. అదే.. స్పీడు. ఆ మాటకొస్తే ఇప్పుడు త్రిష మరింత వేగంగా సినిమాలు చేస్తోంది. ఇదివరకెప్పుడూ లేనంత పారితోషికం అందుకొంటోంది. ప్రస్తుతం చిరంజీవితో `విశ్వంభర`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి త్రిష షూటింగ్ పార్ట్ కూడా పూర్తయ్యింది. దాంతో తెలుగులో కొత్త సినిమాలపై సంతకాలు చేయడానికి మళ్లీ ఛాన్స్ దొరికింది.
హిందీతో విజయవంతమైన ‘కిల్’ తెలుగు తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రమేష్ వర్మ దర్శకుడు. లారెన్స్ కథానాయకుడు. ఇందులో త్రిషని కథానాయికగా ఎంచుకొన్నట్టు సమాచారం. ప్రస్తుతం త్రిషతో చిత్రబృందం సంప్రదింపులు జరుపుతోంది. తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ చిత్రానికి ‘కిల్’ అనే టైటిల్ నే ఖరారు చేసినట్టు తెలుస్తోంది. రేపు లారెన్స్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ నీ రివీల్ చేసే అవకాశం ఉంది. లారెన్స్ కథానాయకుడిగా ‘బెంజ్’ అనే ఓ తమిళ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఆ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్ డేట్ కూడా రేపే రాబోతోంది. ‘కిల్’ రీమేక్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. ఒకవేళ త్రిష ఖాయమైతే, ఈ ప్రాజెక్ట్ మరింత క్రేజ్ సంపాదించుకొంటుందనడంలో ఎలాంటి అనుమానం లేదు.