ఈవీవీ సత్యనారాయణ కథలన్నీ వినోదాత్మకంగా సాగేవే. ఆయన టైటిళ్లు కూడా అలానే ఉండేవి. ‘ఏవండీ ఆవిడ వచ్చింది’, ‘ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు’ ఇలా వెరైటీ టైటిళ్లు పెట్టేవారు. సినిమా పేర్లలో ఆయన మార్క్ స్పష్టంగా కనిపించేది. ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా తన సినిమాకు ఈవీవీ స్టైల్ లో ఓ టైటిల్ సెట్ చేయబోతున్నట్టు సమాచారం.
వెంకటేష్ కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 90 శాతం షూటింగ్ పూర్తయ్యింది. మరోవైపు డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలెట్టారు. ఈ సినిమా కోసం ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. వాటితో పాటు రెండు కొత్త టైటిళ్లు కూడా రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది. ‘ఇంట్లో ఇల్లాలు – పోలీస్ స్టేషన్ లో ప్రియురాలు’, ‘ఇక్కడ ఇల్లాలు.. అక్కడ ప్రియురాలు’ అనే టైటిళ్లు చాంబర్ లో రిజిస్టర్ చేయించారు. ఇవి అనిల్ రావిపూడి, వెంకీ సినిమా కోసమే అని టాక్. ఈ కథ కూడా ఇల్లాలు, ప్రియురాళ్లకు సంబంధించినదే. కాబట్టి.. ఈ టైటిల్స్ యాప్ట్ అనుకొంటున్నారు. ఫ్యామిలీ డ్రామాలకు ఇలాంటి టైటిళ్లు బాగా సెట్టవుతాయి. అయితే ఇందులో క్రైమ్ ఎలిమెంట్, సస్పెన్స్ కూడా ఉన్నాయి. ఈ దీపావళికి టైటిల్ ప్రకటించాలని చిత్రబృందం భావిస్తోంది. అయితే మూడు టైటిళ్లలో ఏది ఫిక్స్ చేయాలి? అనే విషయంలో ఇంకా ఓ స్పష్టతకు రాలేదని తెలుస్తోంది. దిల్ రాజు ఆమోద ముద్ర పడగానే, టైటిల్ ప్రకటించేస్తారు.