హైదరాబాద్ సిటి లో నెలరోజుల పాటు పోలీస్ ఆంక్షలు విధిస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు,పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వాస నీయ సమాచారం ఉందని అధికారికంగా ప్రకటించారు. U/S 163 BNS యాక్ట్ ప్రకారం ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షల ప్రకారం సభలు,సమావేశాలు,దర్నాలు,రాస్తారోకోలు,ర్యాలీ లు నిర్వహించడానికి అవకాశం లేదు. ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు తీసుకుంటారు,
ఈ ఉత్తర్వులు ఇవ్వడానికి కారణం ఏమిటన్నదానిపై ఆసక్తికర చర్చ జరగుతోంది. నవంబర్లో కొన్ని బంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే చాలా ఫైల్స్ రెడీ అయ్యాయని కక్ష సాధింపులు అనే మాట రాకుండా పూర్తి ఆధారాలతోనే అరెస్టులు ఉంటాయని పొంగులేటి చెప్పారు. దీనిపై కేటీఆర్ భిన్నంగా స్పందించారు. ఏం పీక్కుంటారో పీక్కోండి అని సవాల్ చేశారు. ఇంత చేసిన తర్వాత సైలెంట్ గా ఉండే అవకాశం ఉండదని ఏదో ఒకటి చేస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఈ క్రమంలో రాజకీయ ఆందోళనలు పెరిగే అవకాశం ఉందని ముందస్తుగానే నెల రోజుల పాటు ఆంక్షలు విధించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఫామ్ హౌస్ లో లిక్కర్ పార్టీ అంశం రాజకీయంగా దుమారం రేగుతోంది. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తల్ని ఆందోళనలకు రెచ్చగొట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తాజా పరిణామాలతో హైదరాబాద్ లో వచ్చే నెల రోజుల పాటు ఎలాంటి ప్రదర్శనలు ఉండవు కానీ టెన్షన్స్ మాత్రం తప్పదన్న వాదన వినిపిస్తోంది.