తెలుగు చలన చిత్రపరిశ్రమ 75 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా వజ్రోత్సవాల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపిన సంగతి గుర్తుండే ఉంటుంది. పరిశ్రమ మొత్తం కలసి కట్టుగా జరిపిన మెగా ఈవెంట్ ఇది. అగ్ర తారలంతా స్టేజ్‌పై ఆడారు, పాడారు. అంతా ఒకటే అని గుర్తు చేశారు. అయితే.. ఆ కార్యక్రమంలో కొన్ని లోటు పాట్లు కూడా జరిగాయి. ముఖ్యంగా చిరంజీవికి లెజెండరీ అవార్డు ఇవ్వడం పట్ల కొంతమంది కినుక వహించారు. దీనిపై మోహన్‌బాబు ఆ వేదికపై సెటైర్లు వేశారు. సెలబ్రెటీ – లెజెండరీ అవార్డుల గురించి ఓ పెద్ద వివాదమే రేగింది. చిరంజీవి తనకొచ్చిన అవార్డును టైమ్ కాప్యుల్ లో వేసేశారు. ‘ఈ అవార్డుకు అర్హత పొందినప్పుడే దీన్ని అందుకొంటాను’ అంటూ ఆవేశంగా మాట్లాడి, లెజెండరీ పురస్కారం తిరస్కరించారు.
ఇప్పుడు ఏఎన్నార్ అవార్డు అందుకొంటున్న సమయంలో ఆ సంగతిని చిరంజీవి గుర్తు చేసుకోవడం విశేషం. ‘ఎవరైనా సరే ఇంట గెలిచి, ఆ తరవాత రచ్చ గెలవాలని అనుకొంటారు. నేను ముందు రచ్చ గెలిచాను. ఇంట గెలిచే అవకాశం వచ్చినా చేజారింది’ అంటూ వజ్రోత్సవాల ఎపిసోడ్ ను గుర్తు చేసుకొన్నారు. ”కొంత ప్రతికూల పరిస్థితుల్లో, హర్షించని సమయంలో ఆ రోజు లెజెండరీ అవార్డును కాప్యుల్ బాక్స్ లో పడేశాను. నాకు అర్హత వచ్చినప్పుడే తీసుకొంటాను అన్నాను. ఇప్పుడు ఏఎన్నార్ అవార్డు అందుకొంటున్నప్పుడు నేను ఇంట కూడా గెలిచాను అనిపిస్తోంది” అన్నారు చిరంజీవి.
ఈ మాటల్ని బట్టి.. లెజెండరీ అవార్డు తీసుకొనే అర్హత ఇప్పుడొచ్చిందని చిరు భావిస్తున్నారా? లెజెండరీ అవార్డు కంటే ఏఎన్నార్ పురస్కారం గొప్పదని అనుకొంటున్నారా? అనే హాట్ హాట్ చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. నిజానికి చిరు ఎప్పటికీ లెజెండే. అప్పట్లో జరిగిన రాజకీయాలు, కొంతమంది అక్కసు వల్ల చిరు లెజెండరీ పురస్కారాన్ని అందుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు అంతకు మించిన అవార్డే వచ్చింది. పద్మభూషణ్, పద్మ విభూషణ్, ఏఎన్నార్ అవార్డు.. ఇవన్నీ వచ్చాక కూడా చిరుని లెజెండ్ అనకుండా ఉంటామా?