ఏఎన్నార్ జాతీయ పురస్కార ప్రదానోత్సవం వైభవంగా సాగింది. అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా చిరంజీవి ఈ అవార్డు అందుకొన్నారు. ఓ పద్మవిభూషణ్ (అక్కినేని నాగేశ్వరరావు) స్థాపించిన అవార్డును మరో పద్మభూషణ్ (అమితాబ్ బచ్చన్) చేతుల మీదుగా పద్మభూషణ్ చిరంజీవి అందుకోవడం నిజంగా అపురూప ఘట్టమే. ఏఎన్నార్ వందో జయంతిని పురస్కరించుకొని, చిరంజీవి లాంటి గొప్ప నటుడ్ని, స్టార్‌ని సన్మానించుకోవడం ఎంతైనా సముచితం. గొప్ప సందర్భం. ఈ కార్యక్రమానికి అమితాబ్ రావడం మరింత వైభవాన్ని తెచ్చిపెట్టింది.
సాయింత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం దాదాపు 3 గంటల పాటు సాగింది. ఆ మూడు గంటలూ బిగ్ బీ ఓపిగ్గా కూర్చోవడం అక్కినేని కుటుంబంపై ఆయనకున్న గౌరవాన్ని తెలుపుతోంది. కార్యక్రమం ముగిసిన తరవాత కూడా ఆయన హుటాహుటిగా పరుగులు పెట్టలేదు. అందర్నీ పేరు పేరున పలకరించారు. చిరు, నాగ్ తో చాలాసేపు వేదికపై మాట్లాడారు. జోకులు వేసి, నవ్వించారు. తన ప్రసంగంతోనూ బిగ్ బీ ఆకట్టుకొన్నారు. వారసుల గురించి తన తండ్రి రాసిన కవితలోని కొన్ని పంక్తుల్ని ఈ సందర్భంగా చదివి వినిపించారు. తను తెలుగులో మూడు సినిమాలు చేశానని, ఇక నుంచి తనని తెలుగు చిత్రసీమలోని నటుడిగా పరిగణించాలని, తెలుగు చిత్రసీమ సభ్యుడిగా తను గర్వపడుతున్నానని చెప్పడం తెలుగు వారి మనసుల్ని గెలుచుకొంది. అమితాబ్ ఎల్లలు లేని నటుడు. గొప్ప స్టార్. భాషతో సంబంధం లేకుండా ఏళ్ల తరబడి, సినిమా ప్రియుల్ని అలరిస్తూనే ఉన్నారు. అలాంటి స్టార్… తనని తెలుగు నటుడిగా గుర్తించడమనడం ఆయన సంస్కారానికి నిదర్శనం.