బెటాలియన్ కానిస్టేబుళ్ల రాజకీయ ఆందోళనల్లో దిగిడం తెలంగాణలో సంచలనం రేపుతోంది. ఎంతో క్రమశిక్షణతో ఉండాల్సిన వారు ఎందుకు ఇలా చేస్తున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు. చివరికి వారి వల్లనే హైదరాబాద్‌లో పోలీస్ యాక్ట్ అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. సీఎం నివాసం, సెక్రటేరియట్‌తో పాటు కొన్ని కీలక ప్రభుత్వ ఆఫీసుల్నితమ అధీనంలోకి తీసుకుని రచ్చ చేసేందుకు పెద్ద కుట్ర చేశారన్న అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీస్ యాక్ట్ ప్రకటించారు. సెక్రటేరియట్లో పోలీసు ఉద్యోగులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. రేవంత్ ఇంటి వద్ద భద్రతను పెంచారు.
బెటాలియన్ కానిస్టేబుళ్లు ఎవర్ని చూసుకుని ఇంత తీవ్రమైన రాజకీయ ఆందోళనలు చేస్తున్నారన్నదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ అంశంపై పోలీసు వర్గాలే లీకులు ఇచ్చాయి. డిపార్టుమెంట్లో పని చేసి రాజకీయాల్లోకి పోయిన ఓ అధికారే… బెటాలియన్స్‌లో తనకు ఉన్న పరిచయాలు, పట్టు.. కుల ఉద్యమాలతో వచ్చిన పరిచయాలతో ఈ ఆందోళనలకు స్కెచ్ వేశారని పక్కా సమాచారం అందిందని అంటున్నారు. ఆ ఐపీఎస్ అధికారి ఉద్యోగం చేశారు కానీ తన రాజకీయ ఆకాంక్షల కోణంలోనే చేశారని అంటున్నారు.
ఓ ప్రముఖ విపక్ష పార్టీలో కీలకంగా ఉంటున్న ఆయన ప్రభుత్వంపై పోలీసుల్ని రెచ్చగొట్టడంలో సక్సెస్ అయ్యారని… కానీ వాటిని కనిపెట్టి… నిర్వీర్యం చేయడంలో డిపార్టుమెంట్ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేశారని అంటున్నారు. ఇంటలిజెన్స్ నుంచి స్పష్టమైన సమాచారం ఉండటంతో ఆయనట్రాప్ లో పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రాజకీయ కుట్రల్లో భాగమైన పోలీసుల్ని డిస్మిస్ చేస్తున్నారు.