“జడ్జి అంటే రెండుపార్టీల్ని సమానంగా చూసి నిష్పక్షపాతంగా తీర్పు చెప్పాలి., విజయమ్మ ఓ వైపు మాట్లాడుతున్నారు. ఆమె ఎలా సరైన తీర్పు చెబుతారు ” అని వైసీపీ నేత పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు. ఈ ఆస్తుల సమస్యను విజయమ్మే పరిష్కరించి … కుటుంబం రోడ్డున పడకుండా ఆపాలని బాలినేని చేసిన సూచనల పై పేర్ని నాని ఇలా స్పందించారు. అంటే విజయమ్మ చేసే పంచాయతీని కూడా తాము నమ్మబోమని వైసీపీ అధినేత.. విజయమ్మ పుత్ర జగన్ చెప్పించారన్నమాట.
జగన్మోహన్ రెడ్డి అంటే విజయమ్మకు వ్యక్తిగత ద్వేషం ఎందుకు ఉంటుంది ?. జగన్, షర్మిల ఇద్దరూ బిడ్డలే. ఒకరిపై ద్వేషం.. మరొకరిపై ప్రేమ పెంచుకోరు కదా. ఇద్దరూ రెండు కళ్లలాంటి వారే అనుకుంటారు. ఆస్తులు కూడా ఇద్దరికీ సమానంగా దక్కాలని ఆమె కోరుకుంటున్నారు. కానీ జగన్ మాత్రం… ఆమె రాజకీయంగా తనకు అడ్డం వస్తున్నారు కాబట్టి ఒక్క రూపాయి కూడా ఇవ్వనంటున్నారు. ఆయన ఇవ్వను అన్నారు కాబట్టే షర్మిల రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ఒక సారి అడుగుపెట్టిన తర్వాత ఆస్తుల కోసం వెనక్కి వెళ్లే అవకాశం ఉండదు.
తల్లి తనకు అన్యాయం చేయదని తెలుసు. అయినా జగన్ రెడ్డి ఆమె చెప్పే మాటల్ని వినేందుకు సిద్దంగా లేరు. ఆమెను దూరం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. చివరికి కోర్టుకు ఎక్కారు. సొంత తల్లినికోర్టుకు లాగిన వ్యక్తిగా ఆయన నిలబడ్డారు. కోర్టుల్లో తనకు అనుకూలమైన తీర్పులు వస్తే మాత్రమే వ్యవస్థను గొప్పగా చెప్పే ఆయన వ్యతిరేక తీర్పులు వచ్చినప్పుడు నిందించేవారు. ఒక్క న్యాయవ్యవస్థపైనే కాదు.. సొంత తల్లి విషయంలోనూ మంచి చెబుతున్నా ఆయన అలాగే వ్యవహరిస్తున్నారు. సొంత తల్లి తనపై కుట్ర చేస్తోందని అనుకుంటున్నారు. ఇలాంటి మైండ్ సెట్‌తో ఆయన రాజకీయాలు చేస్తున్నారు.