ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రియల్ ఎస్టేట్ కు ఇక తిరుగులేదని అందరూ పెట్టుబడులతో పరుగులు పెడతారని ప్రచారం జరిగింది. కానీ పెట్టుబడులు పెట్టాలనుకున్నవారు అంత వెర్రిగా ఉండరు. అన్నీ చూసుకుంటారు. ఏపీలో టీడీపీ గెలిచిన వెంటనే భూములు ధరల పెరిగాయి. విశాఖ, అమరావతిల్లో కాస్త ఎక్కువగా పెరిగాయి. అలాగే లావాదేవీలు కూడా పెరిగాయి. కానీ అది భూమ్ అన్నంతగా కాదు.
ప్రస్తుతం అమరావతిలో ఇళ్ల స్థలాల ధరలు నిలకడగా ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నధరలతో పోలిస్తే కనీసం 50 శాతం వరకూ పెరిగాయి. ఆదంతా కృత్రిమ పెరుగుదల. అంటే ఎన్నికల ఫలితాల వల్ల వచ్చిన హైప్లో వచ్చిన పెరుగుదల మాత్రమే. రియల్ ఎస్టేట్‌కు నిజమైన పెరుగుదల ఇన్వెస్ట్ మెంట్స్ వచ్చినప్పుడే. అ దిశగా ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి.
అమరావతిలో పూర్తి స్థాయి నిర్మాణాలు ప్రారంభమైన తర్వాత అసలైన రియల్ ఎస్టేట్ మార్కెట్ స్పష్టమవుతోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించిన బడా ప్రాజెక్టులు వైసీపీ అధికారంలోకి రాగానే ఆగిపోయాయి. వాటిని మళ్లీ ప్రారంభించేందుకు అవసరమైన ఆర్థిక మద్దతును కూడగట్టుకుని ఆయా సంస్థలు మళ్లీ పనులు ప్రారంభించాయి. ప్రభుత్వం కూడా డిసెంబర్ నుంచి పనులు ప్రారంభించబోతోంది.
ఈ క్రమంలో వచ్చే ఏడాది నుంచి అమరావతిలో రియల్ ఎస్టేట్ , ఇళ్ల మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంది. సాధారణ. ప్లాట్లు మాత్రమే కాకుండా కాలనీల నిర్మాణం జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.