తెదేపా అధికారంలోకి వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా చాలా మంది మంత్రులు, తెదేపా నేతలు వచ్చే ఐదేళ్ళలోగా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి చూపిస్తామని పదేపదే చెప్పేవారు. రెండేళ్ళు పూర్తయ్యింది. గొంగళి వేసిన చోటే ఉంది. నేటికీ అదే హామీ వల్లె వేస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి దానికి చిన్న సవరణ చేశారు. మిగిలిన మూడేళ్ళలో పోలవరం “మొదటి దశ” పూర్తిచేసి చూపిస్తామని చెప్పారు. అంటే పోలవరం ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదని చెప్పినట్లే అనుకోవచ్చు. ఈ లెక్కన మరో రెండేళ్ళ తరువాత అక్కడే ఏదో చిన్న కాలువ తవ్వి చూపిస్తామని చెపుతారేమో?
కేంద్రం తగినన్ని నిధులు విడుదల చేయకపోవడం వలననే పోలవరం పనులు నత్త నడకన సాగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుంటే, దాని కోసం ఇంతవరకు ఇచ్చిన డబ్బులకే రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా లెక్కలు చెప్పడం లేదని, దాని నిధులు వేరే అవసరాలకి ఖర్చు చేస్తోందని కేంద్రప్రభుత్వం వాదిస్తోంది. ఏమైనప్పటికీ పోలవరం ప్రాజెక్టుని తప్పకుండ పూర్తి చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర భాజపా నేతలు కూడా గట్టిగా హామీలు ఇస్తూనే ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఈ వైఖరి వలన దాని కోసం మంజూరు చేస్తున్న కోట్లాది రూపాయిలు కాంట్రాక్టర్లను పోషించడానికే ఉపయోగపడుతున్నాయి తప్ప పనులు జరగడంలేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరో పదేళ్ళయినా ఆ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉండదు.
ఈ సంగతి తెలిసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టుని భుజానికెత్తుకొన్నారేమో? అనే సందేహం కలుగుతోంది. కానీ ఆ ప్రాజెక్టు వలన రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగం లేదని కాంగ్రెస్, వైకాపాలు వాదిస్తున్నాయి. తెదేపా, భాజపాలు మిత్రపక్షాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా కొనసాగుతున్నప్పటికీ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోతే, ఒకవేళ వచ్చే ఎన్నికలలో అవి విడిపోతే ఆ ప్రాజెక్టు ఇంకెప్పటికీ పూర్తయ్యే అవకాశం ఉండదు. కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం మంచిది.