దేశవ్యాప్తంగా ఇళ్లకు డిమాండ్ తగ్గిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి వడ్డీరేటు. ఇప్పుడు 9 శాతంపైనే వడ్డీరేట్లు ఉంటున్నాయి. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే పది శాతం వరకూ వడ్డించేందుకు రెడీ అవుతున్నాయి. చాలా కాలం నుంచి ఈ వడ్డీ రేట్లలో ఆర్బీఐ మార్పులు చేర్పులు చేయడం లేదు. పరిస్థితులు ఇంకా మెరుగుపడలేదని వేచి చూద్దామని ఆర్బీఐ చెబుతోంది. అది ఎంత కాలమో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ వర్గాలకు అర్థం కావడం లేదు.
ఇళ్ల డిమాండ్లను నిర్ణయించే కీలక అంశాల్లో ఒకటి హోమ్ లోన్స్ వడ్డీ రేటు. హోమ్ లోన్స్ తీసుకున్న వారికి..తీసుకునేవారికి కరోనా అనంతరం ఓ గోల్డెన్ పిరియడ్ అనుకోవచ్చు. అతి తక్కువగా 6 శాతానికే అప్పట్లో హోమ్ లోన్స్ వచ్చేవి. ఈ కారణంగా అచ్చేదిన్ వచ్చాయని అందరూ సంబరపడ్డారు. హోమ్ లోన్ తీసుకున్న వారికి వడ్డీలు తగ్గడంతో… కట్టాల్సిన నెలలు కూడా తగ్గిపోయాయి. కానీ ఆ అచ్చేదిన్ ఎంతో కాలం ఉండలేదు.
ద్రవ్యోల్బణం పెరిగిపోతోందని కారణం చెప్పి.. వరుసగా వడ్డీల రేట్లను ఆర్బీఐ పెంచుకుంటూ పోయింది. ఇప్పుడు మినిమం అంటే మినిమం కనీసం 9 శాతం వడ్డీ రేటు ఉంది. సిబిల్ స్కోర్ బాగా ఉన్న వారికే ఆ మాత్రం ఉన్న వడ్డీరేటు. మిగిలిన వారికి పది శాతానికిపైగానే ఉన్నాయి. వచ్చే ఒకటి, రెండు నెలల్లో ఆర్బీఐ వడ్డీ రేట్లను సవరిస్తే.. ఇళ్ల డిమాండ్ పెరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నారు. మరి ఆర్బీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో మరి !