నందమూరి కుటుంబం నుంచి నాలుగోతరం హీరో వచ్చాడు. తన పేరు కూడా ఎన్టీఆర్.. అంటే నందమూరి తారక రామారావు. నందమూరి జానకిరామ్ తనయుడు ఈ ఎన్టీఆర్. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఎన్టీఆర్ ఫస్ట్ దర్శన్ పేరుతో ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొత్త హీరోపై రూపొందించిన ఏవీని లాంచ్ చేశారు. ఈ ఇంట్రడక్షన్ కాస్త వెరైటీగా సాగింది. ‘నేను..’ అంటూ ప్రజా ప్రతినిధులు ప్రమాణం చేసినట్టు కొత్త హీరోతో ప్రామిస్ చేయించారు.
ఎన్టీఆర్ లుక్ మాసీగా ఉంది. యాక్షన్ కథలకు ఎన్టీఆర్ పనికొస్తాడు. తన వాయిస్ కూడా ప్రామిసింగ్ గానే అనిపించింది. ఓ పెద్ద కుటుంబం నుంచి వస్తున్న హీరో కాబట్టి, తప్పకుండా తనపై ఫోకస్ ఉంటుంది. పైగా ఎన్టీఆర్ పేరు పెట్టుకొన్నాడు. నటన, ఫైట్స్, డాన్స్, డైలాగ్ డిక్షన్ వీటిపై అందరూ దృష్టి పెడతారు. కొత్తకుర్రాడు కదా, అని కొన్ని తప్పులు చేసినా వదిలి పెట్టరు. కాబట్టి.. వైవీఎస్ చౌదరి తగిన రీతిలో తర్ఫీదు ఇస్తున్నారు. దాదాపు 18 నెలల నుంచి నటనతో పాటు అన్ని అంశాల్లోనూ శిక్షణ తీసుకొంటున్నాడు ఎన్టీఆర్. త్వరలోనే షూటింగ్ మొదలు కానున్నదని వైవీఎస్ చౌదరి ప్రకటించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాల్ని మేళవిస్తూ తీస్తున్న కథ ఇదని, పిరియాడిక్ డ్రామా కూడా ఉంటుందని వైవీఎస్ ఓ సందర్భంలో చెప్పారు. కీరవాణి ఈచిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందిస్తున్నారు.