నరకాసురుడు అనే రాక్షసుడ్ని వధించిన సందర్భాన్ని దీపావళి పండుగగా చేసుకుంటున్నాం. ఈ నరకాసురుడు ఎవరు … ?. పురాణాల్లో చెప్పేది సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి ఒక్క మనిషిలోనూ నరకాసురుడు ఉంటాడు. దీపావళి అంటే.. చెడును వధించి మంచికి పట్టం కట్టడం. నరుడ్ని హింసలు పెట్టే… ప్రతి ఒక్కరూ నరకాసురుడే. వాడు మనిషే అవ్వాలని లేదు. నిజానికి మనిషి కాదు. మనిషిలో ఉండే దుష్ట ఆలోచనలే అసలు శత్రువులు. ప్రతి మనిషి తనలో ఉన్న నరకాసుర లక్షణాల్ని వధించి వీలైనంత వరకూ స్వచ్చంగా మారడమే అసలైన దీపావళి.
ఎదుటి వారిపై అకారణంగా కులం, మతం, ప్రాంతం ఆధారంగా ద్వేషం పెంచుకోవడం వాడు కష్టపడి సంపాదించుకున్నా సరే ఈర్ష్య పెంచుకోవడం, బాగుపడ్డవాడిని చూసి బాధపడటం… వంటివివి ఈ కోణాల్లోకే వస్తాయి. ఎదుటి వారికి ప్రేమను పంచి… మంచి కోసం జీవించడమే అసలైన దీపావళి. ఏదైనా ధర్మం ప్రకారం నడవాలి. ఏది ధర్మం..ఏది అధర్మం అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. మనకు దేవుడు లేకపోతే ఆ రూపంలో ఉండే ఇతరులు కొన్ని బాధ్యతలు ఇస్తారు. వాటిని సక్రమంగా నిర్వహించడం అంటే.. దైవపని పూర్తి చేసినట్లే.
ఎవరికీ హాని చేయకుండా.. మంచి కోసం బతుకడమే కాదు.. సమాజం పట్ల … ఇతరుల పట్ల ద్వేషభావంతో వ్యవహరిస్తున్న వారిని… బాధ్యతల్లో ఉన్న వారి దారి తప్పినా .. ఎదిరించడం కూడా కీలకమే. అలా చెడుపై పోరాటం చేసినప్పుడే… తర్వాత దీపావళి వస్తుంది. దీపావళి పండుగ నిగూఢార్థం ఇదే. మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన దీపాలను వెలిగించుకోవాలనే తాత్వికతను దీపావళి పండుగ మనకు అందిస్తుంది. హ్యాపీ దీపావళి.