తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని ప్రభుత్వం అనధికారికంగానే ప్రకటించింది. అధికారికంగా జీవో విడుదల కాలేదు. మొత్తం ఇరవై నాలుగు మంది చైర్మన్, సభ్యల పేర్లు బయటకు వచ్చాయి. చైర్మన్ కాకుండా మరో ఇరవై నాలుగు మంది సభ్యులు ఉండవచ్చు. అంటే మరొకిరకి చాన్స్ ఉంది. ఆ ఒక్కటి ఖాళీ ఉంచి బయటకు వచ్చిన సభ్యులతో జీవో రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు మార్పు చేర్పులు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది.
కొన్ని పేర్ల విషయంలో అభ్యంతరాలు, విమర్శలు రావడంతో ప్రభుత్వం పునంపరిశీలన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఖరారు చేసిన వారు గతంలో కూడా సభ్యులుగా ఉన్నారు. వైసీపీ హయాంలోనూ సభ్యులుగా ఉన్నారు.ఇప్పుడు వారిని కొనసాగించం వల్ల ఒత్తిళ్లకు తలొగ్గి బోర్డును ఏర్పాటు చేసినట్లుగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. అందుకే సిఫార్సులను బట్టి వారిని రీప్లేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు.
బీజేపీ నుంచి అధికారికంగా ఇంకొకరి పేరు ఖరారు కావాల్సి ఉంది. ఇతర రాష్ట్రాల కోటా కూడా బీజేపీ చాయిసే ఎక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్రం నుంచి ఒక బీజేపీ నేతకు అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉండటంతో ఎవరి పేరును ఖరారు చేయలేదు. శుక్రవారం మొత్తం సభ్యుల జాబితాతో ఒకటి, రెండు మార్పులతో.. బోర్డు ఏర్పాటు జీవోను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.