అమెరికా పర్యటనలో ఉన్న నారా లోకేష్ అట్లాంటాలో ఓ ప్రైవేటు వ్యవసాయ క్షేత్రంలో ఎన్నారైలు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగువారు హాజరయ్యారు . దీపావళి వేడుకలు, హలోవిన్ సంబరాలు జరుగుతున్నప్పటికీ నారా లోకేష్ ముఖ్య అతిథిగా వస్తున్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ప్రవాసాంధ్రులు వచ్చారు.
అమెరికాలో ఉన్నానా.. అమలాపురంలో ఉన్నానా అని వచ్చిన జనాల్ని చూసి నారా లోకేష్ కూడా ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనలో ఏ మల్టీనేషనల్ కంపెనీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి పెట్టుబడుల పై చర్చించేందుకు మెయిల్ పెడితే వెంటనే స్పందిస్తున్నారని అన్నారు. సత్యనాదెళ్లకు మెయిల్ పెట్టినా వెంటనే కలిశారని గుర్తు చేసుకున్నారు. ఇదంతా చంద్రబాబు బ్రాండ్ అని లోకేష్ వ్యాఖ్యానించారు,
రాష్ట్రంలో ప్రస్తుతం కక్ష సాధింపులు లేని పాలన జరుగుతోందన్నారు. చంద్రబాబు అనుకుంటే గత ప్రభుత్వంలో వేధించిన వారిని జైల్లో పెట్టడం రెండు నిమిషాల పని మాత్రమేనని గుర్తు చేశారు. అయితే చంద్రబాబు అంతా చట్టబద్దంగా జరగాలనుకుంటున్నారని తెలిపారు. రెడ్ బుక్ అమలు ప్రారంభమయిందన్న లోకేష్.. ఇప్పటికే రెండు చాప్టర్లుఅమలు చేశామని త్వరలో మూడో చాప్టర్ కూడా ప్రారంభిస్తామని తెలిపారు. నారా లోకేష్ కార్యక్రమానికి కోమటి జయరాంతో పాటు ఎన్నారైలుగాఉంటూ ఎమ్మెల్యేలుగా గెలిచిన యార్లగడ్డ వెంకట్రావు, కాకర్ల సురేష్, వెనిగండ్ల రాముతో పాటు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ కూడా పాల్గొన్నారు.