పాత విషయాలు తిరగతోడి, మళ్లీ వైరల్ చేయడంలో సోషల్ మీడియా ముందుంటుంది. అలా… సాయిపల్లవి ఎప్పుడో చేసిన ఓ కామెంట్ పట్టుకొని వైరల్ చేశారు. భారతీయుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిందని ‘బాయ్ కాట్ సాయిపల్లవి’ అంటూ ఎక్స్ వేదికగా ఓ హ్యాష్ ట్యాగ్ సృష్టించి ట్రెండ్ చేశారు. సాయిపల్లవి నటించిన ‘అమరన్’ దీపావళి సందర్భంగా విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందు జరిగిన గోల ఇది. దాంతో ‘అమరన్’ వసూళ్లపై ఈ హ్యాష్ ట్యాగ్ ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా? అనే ఆందోళన నిర్మాతల్లో వ్యక్తమైంది. కానీ… సీన్ చూస్తే రివర్స్ అయ్యింది. ఈ హ్యాష్ ట్యాగ్ ని ఎవరూ పట్టించుకోలేదు.
పైగా ఈ సినిమాలో సాయి పల్లవి నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. క్లైమాక్స్ అంతా తానై నడిపించింది. సాయిపల్లవికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. కుటుంబ ప్రేక్షకులంతా ఆమె పక్షమే. వాళ్లంతా సాయి పల్లవి కోసమైనా థియేటర్లకు వెళ్తారు. కాబట్టి ‘బాయ్ కాట్ సాయిపల్లవి’ మంత్రం ఈ సినిమా వరకూ ఫలించలేదు. పైగా అదే ప్లస్ అయ్యింది కూడా. దీపావళికి చాలా సినిమాలే వచ్చినా ‘అమరన్’కు మంచి ఆదరణ దక్కింది. తమిళ నాట థియేటర్లన్నీ హౌస్ ఫుల్స్ అయ్యాయి. తెలుగులో కూడా మంచి వసూళ్లు దక్కుతున్నాయి. బుక్ మై షోలో అంతటా ‘అమరన్’దే హావా. శివ కార్తికేయన్ సినిమాల్లో బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. తెలుగులో ‘లక్కీ భాస్కర్’కి హిట్ టాక్ వచ్చింది. దాంతో పాటుగా ‘క’ ప్రీమియర్లకూ మంచి అప్లాజ్ వచ్చింది. అయినా సరే.. ‘అమరన్’ అనూహ్యంగా మంచి ఓపెనింగ్స్ దక్కించుకొంది. ఈ దీపావళి చిత్రాలకు లాంగ్ వీకెండ్ కలిసొచ్చే అంశం. శని, ఆదివారాలు మరింత ఫుట్ ఫాల్స్ ఉండొచ్చు.